అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామి వారిని కనులారా చూడాలని భక్తులు పరితపించి పోతుంటారు. దేశ విదేశాల నుంచి వివిధ రూపాల్లో కొండకు చేరుకున్న భక్తులకు వివిధ పద్దతుల్లో స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది టిటిడి. వి.ఐ.పి బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, సర్వదర్శనం, దివ్య దర్శనం వంటి ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూనితులు అవుతుంటారు.. కోవిడ్ ముందు వరకూ సాఫీగానే స్వామి దర్శనం సాగినా తరువాత కోవిడ్ ఆంక్షలతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాల్సి వచ్చింది టిటిడి. దీంతో ఆన్లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులను వాటిని పరిశీలించిన తర్వాతే కొండకు అనుమతించేవారు. కోవిడ్ తగ్గు ముఖం పట్టడంతో క్రమేపి భక్తుల సంఖ్య పెంచుతూ వచ్చింది టీటీడీ. 


ఈ క్రమంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను భూదేవి కాంప్లెక్స్, గోవింద సత్రం, శ్రీనివాసం సత్రాల్లో రోజుకి 45 వేల టోకెన్ల జారీ చేస్తుంది. ఈక్రమంలో స్వామి వారి దర్శనం కోసం సామాన్య భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దత్తున తిరుపతికి చేరుకుని టోకెన్లు పొంది కేటాయించిన సమయాల్లో తిరుమలకు వెళ్ళి స్వామి వారి దర్శనం పొందుతూ వస్తున్నారు.. అధిక రద్దీ కారణంగా టోకెన్ల ప్రక్రియలో రెండు, మూడు రోజులకు సంబంధిన టోకెన్లు ముందస్తుగానే టిటిడి జారీ చేయడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు కొండకు వెళ్ళలేక కుటుంబ సభ్యులతో కలిసి టోకెన్ల జారీ కేంద్రాల వద్దే ఉండాల్సిన పరిస్ధితి నెలకొనేది.


అదే కారణమా?


వారంతాలు, సెలవు రోజుల్లో అధిక సంఖ్యలోనే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు చేరుకునేవారు. ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదో తేదీన 12వ తారీఖు సంబంధిన టోకెన్ల జారీ చేసి తరువాత ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియను నిలిపి వేసింది టిటిడి. రెండు రోజులుగా టోకెన్ల జారీ  నిలిపి వేయడంతో సమాచారం తెలియని భక్తులు స్వామి వారి దర్శనం పొందాలనే ఆతృతతో తిరుపతికి చేరుకున్నారు. ఈనెల 13వ తేదీకి సంబంధించి టోకెన్లను 12వ తారీఖున ఉదయం ఆరు గంటలకు జారీ చేయడంతో అర్ధరాత్రి నుంచి టోకెన్ల కోసం సామాన్య భక్తులు క్యూలైన్స్ లోకి ప్రవేశించారు. దీంతో ఒక్కసారిగా టోకెన్లు జారీ చేసే మూడు ప్రాంతాల్లో గందరగోళ పరిస్ధితులు నెలకొన్నాయి. అయితే రెండు రోజుల పాటు టోకెన్లు నిలిపి వేయడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గట్టుగా టిటిడి ఏర్పాట్లు చేయక పోవడంతో సామన్య భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది.


తొక్కిసలాట


అనూహ్యరీతిలో వచ్చిన భక్తుల మధ్య క్యూలైన్స్ లో తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు భక్తులు సృహ కోల్పోయారు. సృహ కోల్పోయిన భక్తులను హుటాహుటిన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు.. క్యూలైన్స్ లో వృద్ధులు, మహిళలు, చంటిపిల్లలు ఊపిరి ఆడక తల్లడి పోయారు. చాలా మంది భక్తులు నరకయాతన అనుభవించారు. దీంతో ఆగ్రహించిన భక్తులు క్యూలైన్స్, బ్యారిగేడ్లను పీకి పడేశారు. భక్తులను పోలీసులు నియంత్రించలేని పరిస్ధితి నెలకొంది. నిమిషం నిమిషానికి టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పరిస్ధితి చేయిదాటిపోయింది. ఉదయం 11:40 నిమిషాలకు టోకెన్లు లేకపోయినా భక్తులను కొండకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటన చేసింది. దీంతో సామాన్య భక్తులు వివిధ రూపాల్లో కొండకు బయలుదేరారు.


రెండేళ్ల తర్వాత తెరిచిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు


కోవిడ్ ప్రభావంతో సర్వదర్శనాన్ని రద్దు చేయడంతో ఇనాళ్లు మూసి వేసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తెరిచారు. మొత్తం 32 కంపార్ట్మెంట్లు ఉండగా అందులో 7 కంపార్ట్మెంట్ లను టీటీడీ మరమ్మతులు చేస్తోంది.. మిగిలిన 25 కంపార్ట్మెంట్ ల్లో భక్తులను అనుమతించారు. ఇక్కడ భక్తులకు అన్నప్రసాదం, పాలు వంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వైకుంఠం-1, 2 నుంచి ఎస్.ఎం.సీ వరకూ భక్తులు క్యూలైన్స్‌లో వేచి ఉన్నారు. రద్దీ కారణంగా కొండపై నేటి నుంచి ఆదివారం వరకు వి‌ఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.‌ 


దర్శనానికి ఒకరోజుకు పైగా సమయం


ప్రస్తుతం కొండపై స్వామి వారి దర్శనం 35 గంటల నుంచి 40 గంటల వరకూ సమయం పట్టే పరిస్ధితి నెలకొంది రెండేళ్ళుగా కోవిడ్ ఆంక్షల పేరుతో టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తున్న టిటిడి ఇకపై సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం దగ్గర చేస్తూ టోకెన్లు లేక పోయినా దర్శనం కల్పించే విధంగా గత విధానాన్ని ఇలానే కొనసాగిస్తుందా లేదా అనే విషయం మాత్రం వేచి చూడాలి.