Lightning strike at a firecracker manufacturing plant In East Godavari | ఉండ్రాజవరం: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు పడటంతో ఇద్దరు మృతిచెందారు. జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
పిడుగుపాటుకు బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు
సూర్యారావుపాలెం గ్రామ శివారులో బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో కొందరు కార్మికులు దీపావళి పండుగ కోసం టపాసులు తయారు చేసే పనిలో నిమగ్నపై ఉన్నారు. ఇంతలో బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగుపడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అసలే పిడుగు ప్రభావం, మరోవైపు బాణసంచా తయారీ కేంద్రం కావడంతో పేలుడు ప్రభావం అధికంగా ఉంది. ఈ దుర్ఘటనలో బాణసంచా కేంద్రం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరికొందరు మహిళలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మరో 10 మంది వరకు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగ పూట పిడుగు పడి ఇద్దరు మహిళలు చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తీవ్రగాయాలపాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలను విజ్ఞప్తి
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ అధినేత జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. మంటలు చెలరేగి గాయాల పాలైన వారికి తక్షణమే మైరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.