కువైట్‌లో ( Kuwait ) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతని కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. లక్కిరెడ్డి పల్లె  సమీపంలోని దిన్నెపాడుకు చెందిన  35 ఏళ్ల పిల్లోల వెంకటేష్ ( Venkatesh ) ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ కుటుంబం వద్ద డ్రైవర్‌గా చేరాడు. రెండేళ్ల కిందట తన భార్యను కూడా తీసుకెళ్లాడు. అయితే హఠాత్తుగా ఆయనను పోలీసులు త్రిబుల్ మర్డర్ కేసు కింద అరెస్ట్ చేశారు. ఆయన భార్యను బలవంతంగా భారత్‌కు పంపేశారు. ఆ  తర్వాత పోలీసులు అతను తన యజమాని కుటుంబాన్ని అంతమొందించినట్లుగా కువైట్ పోలీసులు ప్రకటించారు. 






వెంకటేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కుటుంబంలో ముగ్గురు కత్తిపోట్లకు గురై మరణించారు ( Triple Murders ) . నాలుగు రోజుల పాటు విషయం ఎవరికీ తెలియదు. దుర్వాసన వస్తూండటంతో చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. కువైట్ పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపారు. సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా హత్యలు జరిగిన సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పిల్లోల వెంకటేష్‌ను గుర్తించారు. అతను ఎక్కడున్నాడో ట్రేస్ చేసి..సులైబియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. 





పోలీసుల విచారణలో వెంకటేష్ తాను ట్రిపుల్ మర్డర్స్ చేసినట్లుగా అంగీకరించాడు. ఆ కుటుంబం తనను వేధించిందని.. ఆర్థిక పరంగా ఇబ్బందులు పెట్టిందని.. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా హత్యలు చేసినట్లుగా అంగీకరించాడు. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో శిక్ష తప్పదన్న ఉద్దేశంలో వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రాణం తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత కడప జిల్లాలోని ( Kadapa )  కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 


కువైట్‌లో వెంకటేష్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భార్యను అక్కడి అధికారులు స్వదేశానికి పంపించారు. వెంకటేష్ భార్య తన భర్త ఈ హత్యలు చేయలేదని.. ఆయనను కాపాడాలని కలెక్టర్‌ను కలిశారు. అయితే రెం  వెంకటేష్ సూసైడ్ చేసుకున్నాడన్న సమాచారంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.