కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో భూ తగాదాలు హత్యలకు దారితీశాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరు హత్యకు గురికాగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శివప్ప, ఈరన్నను వేట కోడవలతో నరికి పెట్రోలు పోసి తగలబెట్టారు ప్రత్యర్థులు. శివప్ప, ఈరన్న అక్కడికక్కడే మృతి చెందారు. శివప్ప, ఈరన్న వైఎస్సార్సీపీకి చెందినవారు. ప్రత్యర్థి వర్గం బీజేపీలో ఉన్నారు. భూ వివాదంలో ఒకరికి వైసీపీ మద్దతు ఇవ్వగా మరొకరికి బీజేపీ మద్దతు ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివప్ప స్థానిక సర్పంచ్‌ సోదరుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.


సంఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ


కౌతాళం మండలం కామవరంలో జరిగిన జంట హత్యల ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు.  బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. భూ వివాదాలే ఈ జంట హత్యలకు కారణమని ఎస్పీ తెలిపారు. కళ్లలో కారంపొడి చల్లి, గొడ్డళ్లు, రాడ్లతో దాడి చేసి హత్య చేశారన్నారు. ఎస్సీ కమ్యునిటీకి చెందిన శివప్ప, ఈరన్నలు చనిపోయారన్నారు. మరో నలుగురు గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని...వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 


అసలేం జరిగిందంటే...


కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య గత కొన్ని రోజులుగా భూవివాదం నడుస్తోంది. గురువారం ఈ వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలు శివప్ప(45), గట్టు ఈరన్న (47) మరణించారు. మరో అయిదుగురికి గాయాలయ్యాయి. పెట్రోల్‌, యాసిడ్‌ స్ప్రే చేసి, కళ్లలో కారం పొడి చల్లి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఆదోని పట్టణానికి చెందిన బోయ మునేంద్ర రాజ్‌కుమార్‌కు చెందిన సర్వే నెంబర్‌ 254/ఉ లో నాలుగు ఎకరాలు, సర్వే నెంబర్‌ 254/అలో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 22 ఏళ్ల క్రితం గ్రామంలోని వడ్డే రామాంజి, వడ్డే రాజు, వడ్డే మల్లికార్జున, వడ్డే ఈశ్వర్‌, వడ్డే గోపాల్‌లు అమ్మినట్లు అన్నదమ్ములు ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోవడంతో ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ భూమిని వడ్డే రామాంజి కుటుంబం సాగు చేస్తున్నారు. 


పక్కా ప్లాన్ తో


ఈ విషయంపై ఇరువర్గాలు కోర్టుకు వెళ్లాయి. కోర్టు తీర్పు మునేంద్ర రాజ్‌కుమార్‌కు అనుకూలంగా రావడంతో స్థానిక సర్పంచి వసంత్‌ కుమార్‌ సోదరులు పొలం విషయం చర్చకు పిలిచారు. ఈ విషయాన్ని బీజేపీలో ఉన్న వడ్డే గోపాల్‌ విలేకరులతో సమావేశం పెట్టి వైసీపీ మండల నాయకుడు మహేందర్‌రెడ్డి భూకబ్జాలు మానుకోవాలని కోరారు. తమ భూమి పంచాయితీలో తలదూర్చవద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో భూవివాదంతో ఎటువంటి సంబంధంలేని తమ నాయకునిపై ఆరోపణలు ఎలా చేస్తారని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివప్ప, ఈరన్న, సత్యప్ప, అయ్యప్ప, బజారప్ప, పెద్ద తిమోతి, ఇస్మాయిల్‌తో పాటు మరికొందరు బీజేపీ నాయకులు వడ్డే గోపాల్‌ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు దాడికి దిగారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటి వద్దకు రాగానే పెట్రోల్‌, క్రిమిసంహారక మందు వాళ్లపై స్ప్రే చేసి, కళ్లల్లో కారం చల్లారు. తర్వాత వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో  వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు.