Tiger Attack :  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. చౌపన్ గూడ పంచాయతీ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే రైతు చేనులో పనిచేస్తుండగా పెద్దపులి ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత దూరం రైతు మృతదేహాన్ని లాక్కెళ్లింది. స్థానికులు అరుపులతో రైతు మృతదేహాన్ని వదిలిపారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని దాడి జరిగిన తీరును, పరిసరాలను పరిశీలిస్తున్నారు. పక్కనున్న మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యంలో కొద్దిరోజుల క్రితం  ఇద్దరు వ్యక్తులను పులి దాడి చేసి హతమార్చింది. దీంతో ఆ పులే ప్రస్తుతం ఇటువైపు వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. కుమ్రం భీం జిల్లాలో ఇప్పుడు సిడాం భీము అనే రైతు పై పులి దాడిచేసి హతమార్చడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. 


పశువులపై దాడి 


ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్‌ పరిసర అటవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాగజ్‌నగర్‌ మండలం కొసిని, రేగలగూడ, అనుకోడ సమీప అటవీ ప్రాంతాల్లో పశువులపై పెద్దపులి దాడి చేసింది. ఇటీవల చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాల్లోను పులి రెండు పశువులను హతమార్చింది. కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తు అలజడి సృష్టించింది. కొసిని రేగలగూడ అటవి ప్రాంతంలో భీమేష్ అనే పశువుల కాపరి పశువులను కాస్తుండగా ఒక్కసారిగా పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఆవుపై పులి దాడి చేయడాన్ని పశువుల కాపరి భీమేష్ కళ్లారా చూశానని చెప్పాడు. పక్కనున్న వారిని పిలిచి కేకలు వేయడంతో పులి కాసేపటికి ఆవును వదిలి అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని చెప్పాడు. 


ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం 


ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ శివారులో ఇటీవల రెండు పులులు జనాల కంట పడిన ఘటన మరవక ముందే భీంపూర్ మండలం తాంసి -కె శివారులో ఆదివారం అర్ధరాత్రి 4 పులుల సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. పిప్పల్కోటి రిజర్వాయర్ పనుల ప్రదేశంలో పులులు టిప్పర్ వాహన డ్రైవర్ కంట పడ్డాయి. డ్రైవర్ తీసిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. పంట చేతికి వచ్చిన సమయంలో పులుల సంచారం తమకు నష్టం చేస్తోందని స్థానికులు వాపోతున్నారు. 


భీంపూర్ లో ఆవుపై దాడి 


ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి దాడి కలకలం రేపుతుంది. భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఆవుపై పులులు దాడి చేసి హతమార్చాయి. ఆవు వెనుక భాగం పూర్తిగా తినేశాయి. కొద్ది రోజులుగా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి, తాంసి కె, గొల్లఘాట్ తాంసి శివారులో పులులు సంచరిస్తున్నాయి. ఆదివారం రాత్రి తాంసి కె సమీపంలో టిప్పర్ డ్రైవర్ కి నాలుగు పులులు రోడ్లపై కనిపించాయి. అతడు సెల్ ఫోన్ లో పులుల వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్థులు అటవీ ప్రాంతాల్లోకి, పొలాల్లోకి వెళ్లకూడదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. తాజాగా భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఓ ఆవును పులులు హతమార్చి సగభాగం పూర్తిగా తినేయడంతో  పత్తి చేలలలో పంట కోసేందుకు వెలుతున్న కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.