Krishna News :  ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఇటీవలో భార్యకు చీర ఆరేయడం రాలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అయితే తాజాగా ఓ వ్యక్తి భార్యతో కూర విషయంలో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా పెడన పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కూర విషయంలో భార్యతో గొడవ పడ్డాడు. కోపంలో ఉన్న అతడు  స్నేహితుని ఇంటికి వచ్చి పురుగుమందు తాగాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనపై పెడన పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. 


అసలేం జరిగింది? 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూడూరు మండలం పిండివానిపాలెంకు చెందిన చింతల తిరుమలరావు(30)కు రెండేళ్ల కిందట వివాహం అయింది. అతడికి భార్య, 8 నెలల పాప ఉన్నారు. తిరుమలరావు గురువారం ఇంట్లో కూర విషయంలో భార్యతో గొడవపడి స్నేహితుడు గోపీ ఇంటికి వచ్చాడు. స్నేహితుడు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు తిరుమలరావు బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు అతడిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. తిరుమలరావు భార్య నిర్మల జ్యోతి ఇచ్చిన ఫిర్యాదుతో పెడన ఎస్‌ఐ మురళి శుక్రవారం కేసు నమోదు చేశారు. 


చీర ఆరేయడం రాదని


చిన్న చిన్న కారణాలకే విలువైన జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు కొందరు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, నచ్చిన కూర వండలేదనో, నాన్న బైక్ కొనివ్వలేదనో ఇలా కారణాలు ఏమైనా సరే ఎంతో చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవలె మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌కు చెందిన సమాధాన్ సాబ్లే(24) అనే యువకుడు తనకన్నా వయసులో ఆరేళ్ల పెద్దదైన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత భార్య ప్రవర్తన సరిగా లేదని కారణం చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు యువకుడు రాసిన సూసైడ్ నోట్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. తన భార్యకు కనీసం చీర కూడా ఆరేయడం కూడా రాదని, సరిగా నడవలేదని, మాట్లాడలేదని ఇలా రాసుకొచ్చాడు. తనతో జీవితాన్ని కొనసాగించలేనని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. 


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల యువకుడు తన భార్యపై అసంతృప్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ముకుంద్‌నగర్‌లో నివాసం ఉంటున్న సమాధాన్ సాబ్లే తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడని ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ బ్రహ్మ గిరి మాట్లాడుతూ "సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాం. అందులో తన భార్య చీర సరిగ్గా కట్టుకోలేదని, నడవడం లేదా మాట్లాడటం రాదని అతను పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన కంటే ఆరేళ్లు పెద్దదైన మహిళతో ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ జరుగుతోంది " అని అధికారి తెలిపారు.