Krishna District News: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి రవాణాకు ఏపీ కేంద్రంగా మారుతోంది. స్మగ్లర్లు పెద్ద ఎత్తు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పోలీసులు నిత్యం స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం లేదు. రెండు రోజుల్లో సుళ్లూరుపేట, కోదాడలో గంజాయి పట్టుబడగా, గురువారం కృష్ణా జిల్లాలో గంజాయి తరలిస్తున్న  ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో  సెయింట్ జాన్స్ పాఠశాల సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకున్నారు.


 మొత్తం నలుగురు సభ్యులు ఉన్న ముఠాలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు స్మగ్లర్లు పారిపోయారు. కారులో 100 కిలోల గంజాయిని ఉన్నట్లు సమాచారం. ఒడిశా నుంచి నుంచి గుజరాత్‌కి తరలిస్తూ గంజాయి ముఠా పోలీసులకు పట్టుబడింది. గంజాయి తరలించే స్మగ్లర్లు గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరు కొంతకాలంగా సెయింట్ జాన్స్ స్కూల్ సమీపంలో ఓ ఇంటిని బాడుగ తీసుకుని ఒడిశా నుంచి ఏపీ మీదుగా గుజరాత్‌కు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కారు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 


రాజవొమ్మంగి స్టేషన్ పరిధిలో..
రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీసుస్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జడ్డంగి ఎస్ఐ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను గురువారం రిమాండ్ నిమిత్తం అడ్డతీగల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులు హాజరు పరిచారు.


తిరుపతిలో..
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సూళ్లూరుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సీఐ సూర్యనారాయణ కథనం.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం, మల్కాన్‌గిరి జిల్లా, బరియబహల్‌ ప్రాంతానికి చెదిన మందన్‌ మంతల్‌(27), అదే జిల్లా టింగాలిగూడ గ్రామానికి చెదిన బలరాం గౌడ్‌ (18) అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులు ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయిని సరఫరా చేసేందుకు సూళ్లూరుపేటకు చేరుకున్నామని ఒప్పుకున్నారు. ఆపై వారి వద్ద ఉన్న 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


కోదాడలో 70 కేజీల పట్టివేత
రాష్ట్ర సరిహదు కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామాపురం క్రాస్‌ రోడ్డు చెక్‌పోస్టు వద్ద నిందితులు సినీ ఫక్కీలో పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 70కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఓ కారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. బుధవారం రాత్రి చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయడాన్ని కారులో ఉన్న నలుగురు నిందితులు గమనించి కారు వేగాన్ని పెంచి మరో రోడ్డులో తప్పించుకునే యత్నం చేశారు. సమీపంలో ఉన్న ఆటోను ఢీకొట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా 70 కిలోల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.