Konaseema News : నిన్నే ప్రేమించానన్నాడు. నువ్వు లేకపోతే బతకలేన్నాడు. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తానన్నాడు. పైగా మీ కుటుంబం మాకు బంధువులని నిన్ను ఎలా వదులుకుంటానని నమ్మబలికాడు. పెళ్లికాకుండానే తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. అన్నీ నమ్మేసిన ఆ యువతి మాయగాడి మాయమాటలకు లోబడిపోయింది. దీనికి ప్రతిఫలంగా పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. చేతిలో చెయ్యేసి చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉంటాడన్న నమ్మకంతో పెళ్లికాకపోయినా తమ ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఆ గర్భాన్ని అలానే ఉంచుకుని నవమాసాలు మోసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన కలలన్నీ కలగానే మారిపోగా చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసిన ప్రియుడు పత్తాలేకుండా పోగా అసలు నువ్వెవరు అనే పరిస్థితికి వచ్చింది అతని నిజస్వరూపం. తనకు అన్యాయం చేయొద్దని ప్రాధేయపడ్డా అతని కఠిన హృదయం మారదని తెలిసి తనకు కాకపోయినా తన బిడ్డకు అయినా న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతని వల్లే బిడ్డ జన్మించిందని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకోసం పోలీసులు డీఎన్ఏ టెస్ట్ చేయించారని, అయితే తనకు పాప పుట్టి పది నెలలు గడుస్తున్నా ఇంతవరకు తన తండ్రి ఎవరో చెప్పుకొలేని స్థితిలో ఉన్నారని వాపోతోంది. 


ప్రేమించి మోసం 


కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాల తిప్పకు చెందిన వాతాడి వెంకటలక్ష్మి (22) మామిడికుదురు మండలం గోగన్నమఠానికి చెందిన పెసంగి నరసింహారావు ప్రేమించుకున్నారు. వెంకటలక్ష్మి అక్క అత్తవారి ఇళ్లు గోగన్నమఠంలో కాగా అక్కను చూసేందుకు వెళ్లి వెంకటలక్ష్మిని ప్రేమించానని నరసింహారావు వెంటపడేవాడని, ఈ క్రమంలోనే 2021లో అతను చెప్పిన మాయమాటలు నమ్మి శారీరకంగా ఒక్కటయ్యామని బాధితురాలు చెబుతోంది. నాలుగు నెలల తరువాత తాను గర్భవతినని చెప్పానని, అయితే అప్పటివరకు ఎంతో నమ్మకంగా ఉన్న అతను తనను వదిలించుకునేందుకు ప్రయత్నించాడని తెలిపింది. తాను అప్పటికే నాలుగో నెల గర్భవతినని, ఆ తరువాత పది నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చానని చెబుతోంది. 2021లో పెసంగి నరసింహారావుపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, అయితే గత నెల 28వ తేదీన విజయవాడలో తనకు, తన పాపకు, నరసింహారావుకు డీఎన్ఏ టెస్ట్ కోసం రక్త నమూనాలను తీసుకున్నారని చెప్పింది. నెల రోజులు గడచిపోయినా ఇంతవరకు తనకు ఎటువంటి సమాచారం రాలేదని, తన బిడ్డకు తండ్రి ఎవ్వరో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నానని వాపోతోంది. పోలీసుల వద్దకు వెళ్లి అడిగితే ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారని తెలిపింది. మరో పక్క తన అక్క అత్తగారి ఇంటి వద్ద మోసం చేసిన నరసింహారావు తండ్రి, కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని, ఇవన్నీ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోంది.


బాధితురాలికి న్యాయం చేసేలా ప్రయత్నించాం : ఎస్సై


నమ్మించి మోసం చేసిన పెసంగి నరసింహారావు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని, ఈ కేసులో కోర్టు రిమాండ్ కూడా విధించిందని ఉప్పలగుప్తం ఎస్సై జి. వెంకటేశ్వరరావు తెలిపారు. అంతకు ముందు బాధిత యువతికి న్యాయం చేసేందుకు నిందితునికి పలుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందని, అయితే అతనిలో ఎటువంటి మార్పు కనిపించడంలేదన్నారు. విజయవాడలో ముగ్గురికి డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించామని అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపారు. బాధిత యువతికి పూర్తిగా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అయితే కొంత సమయం పడుతుందని ఎస్సై వెల్లడించారు. బాధిత యువతికి కానీ, ఆమె అక్కకు కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని భరోసా ఇచ్చారు.