Paster Illegal Surrogacy : యువతుల పేదరికాన్ని అవకాశంగా మార్చుకుని ఓ పాస్టర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. పాస్టర్ చేతిలో యువతి మోసపోయిందని ఆమె బంధువులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. యువతిని నిమ్మించిన పాస్టర్... ఆమెను గర్భవతిని చేసి ఆపై రహస్యంగా ఓ ఆసుపత్రిలో పురుడు పోయించి ఆ బిడ్డను రూ.10 లక్షలకు అమ్మేశాడని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై యువతి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న పాస్టర్ మాత్రం కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లగా ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందని పలువురు చెబుతున్నారు.
పాస్టర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో బెజవాడ హోసన్న అలియాస్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పాస్టర్‌గా కొంతకాలంగా చర్చి నడుపుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి చర్చికి వెళ్తుండేది. ఈ యువతికి చిన్నవయసులోనే తల్లి మృతిచెందగా తండ్రి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో చదువుకుంటూనే పనిచేసుకుని జీవిస్తుంది. ఇదే ప్రాంతంలో పాస్టర్ హోసన్న అలియాస్ సుబ్రహ్మణ్యం నడుపుతున్న చర్చికి వెళ్లేది. ఈ పరిచయంతో యువతికి ఆర్థిక భరోసా కల్పిస్తానని పలు మీటింగ్‌లకు తీసుకెళ్లేవాడు. పాస్టర్ నివాసం ఉంటున్న కాకినాడకు తీసుకెళ్లి ఆమెతో ఇంటి పనులు చేయించుకుని డబ్బులు ఇస్తూ ఉండేవాడని యువతి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతి శరీరంలో మార్పులు గమనించామని, ఆమెను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పేదని వారు ఆరోపించారు.
బిడ్డను పది లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణ
ఇదిలా ఉంటే అమలాపురంలోని ఓ ఆసుపత్రిలో యువతిని చేర్చించిన పాస్టర్ అక్కడ రహస్యంగా కొందరు సిబ్బంది సాయంతో సిజేరియన్ చేయించాడు. యువతి మగబిడ్డకు జన్మనివ్వగా... ఆ బిడ్డను రూ.10 లక్షలకు అమ్మేశారని యువతి బంధువులు ఆరోపించారు. ఇందులో ఏదో రహస్యం ఉందని పాస్టర్‌పై ఇప్పటికే అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని యువతి బంధువులు కలెక్టర్ వద్దకు వచ్చారు. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బాధితురాలికి ఈ విషయం తెలియదని, బాధితురాలి తండ్రి, పాస్టర్ కలిసి ఈ పనిచేశారన్నారు. పేద వర్గాలకు చెందిన అమ్మాయిలను భక్తి పేరుతో ట్రాప్ చేసి డబ్బులు ఎరవేసి దుర్మార్గాలకు ఒడిగడుతున్న పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పేద మహిళలకు డబ్బు ఆశచూపి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు.
సరోగసి చేయించాడని అనుమానం
నిరుపేద యువతి గర్భం దాల్చడం, పాస్టర్ అడిగనప్పుడల్లా ఆర్థిక సాయం చేయడం వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జిల్లా కలెక్టర్‌కు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో పాస్టర్ వ్యవహారశైలిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద యువతికి, ఆమె తండ్రికి డబ్బు ఎరచూపి సరోగసి చేయించాడని, అందుకే ఆ బిడ్డ ప్రసవం అనంతరం కనపడకుండా చేశారని ప్రచారం జరుగుతోంది. అనధికార సరోగసి విధానం చట్టవిరుద్ధం.. అయితే విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.