American Dollars Smuggling : అమెరికా నుండి స్మగ్లింగ్ చేసిన గుట్కా ప్యాకెట్లలో అమెరికన్ డాలర్లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. గుట్కా మాటున 32 లక్షల విలువ చేసే అమెరికన్ డాలర్లు తీసుకొనివచ్చారు. కోల్‌కతా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆదివారం చేపట్టిన తనిఖీల్లో పాన్ మసాలా పౌచ్ లను సీజ్ చేశారు. వీటిల్లో 40,000 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారి గుట్కా సాచెట్ లను చింపివేస్తున్న వీడియోలో, పాన్ మసాలా పౌడర్ తో పాటుగా ప్లాస్టిక్ తో సీల్ చేసిన 10 డాలర్లను గుర్తించారు.
రూ.32 లక్షల విలువ చేసే కరెన్సీ
గుట్కా ప్యాకెట్లలో అమెరికా కరెన్సీ అక్రమ రవాణా చేస్తున్న ఘటన కోల్ కతా చోటుచేసుకుంది. కోల్ కతా నుంచి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళుతున్న ప్రయాణికుడి నుంచి ఈ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్ కతా కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బ్యాంకాక్ వెళ్తున్న ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడి లగేజీలో పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తెరిచి చూస్తే అందులో గుట్కాతో పాటు అమెరికా డాలర్లు కనిపించాయి. అమెరికా డాలర్లను ఓ రేపర్ లో చుట్టి ప్యాక్ చేసినట్టు గుర్తించారు. భారత కరెన్సీలో వీటి విలువ సుమారు రూ.32 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
గోల్డ్ స్మగ్లింగ్
బంగ్లాదేశ్ నుంచి విశాఖకు అక్రమంగా తరలిస్తున్న 1.86 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.1.07 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారం స్మగ్లింగ్ పై సమాచారంతో డీఆర్ఎస్ అధికారులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుంచి షాలిమార్-సికింద్రాబాద్ AC సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12773)లో వచ్చిన స్మగ్లర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గురువారం తెల్లవారుజామున స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల విలువైన 1860.5 గ్రాముల బంగారాన్ని (కడ్డీలు, ముక్కల రూపంలో) స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి నుంచి రాబట్టిన సమాచారంతో సోదాలు చేశారు. ఈ స్మగ్లింగ్ బంగారాన్ని బంగ్లాదేశ్ నుంచి తరలించినట్లు డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు స్మగ్లింగ్ చేసి అక్కడ బంగారం కరిగించి, వివిధ ఆకారాలు, పరిమాణాల్లో బంగారు కడ్డీలు/ముక్కలుగా మార్చారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.