Kids assaulted by a man in Bengaluru: మానసిక రోగులు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూనే నిస్సహాయులపై దాడులు చేస్తారు. ఇలాంటి వారు సైకోలు లాంటి వారు.  బెంగళూరులోని త్యాగరాజనగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డులో  ఇలాంటి ఓ సైకో సీసీ కెమెరాలకు చిక్కాడు. 

Continues below advertisement

ఓ బాలుడు తన మామ ఇంటికి వచ్చి, బయట ఇతర పిల్లలతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుకుంటుండగా, రంజిత్  అలియాస్ రంజన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి బాలుడిని కాలితో బలంగా తన్నాడు. బాలుడు గాల్లోకి ఎగిరి కింద పడిపోగా, నిందితుడు ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దాడిలో బాలుడి కనుబొమ్మ పైన లోతైన గాయమై రక్తం వచ్చింది. చేతులు, కాళ్లపై కూడా గీతలు పడ్డాయి. బాలుడి తల్లి దీపిక వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మొదట పోలీసులు దీనిని నాన్-కాగ్నిజబుల్ (NCR) కేసుగా నమోదు చేసినప్పటికీ, సిసిటివి ఫుటేజీని పరిశీలించిన తర్వాత కోర్టు అనుమతితో బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 115(2) కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.  

35 ఏళ్ల నిందితుడు రంజిత్ గతంలో జిమ్ ట్రైనర్‌గా పనిచేసి మానేశాడని పోలీసులు తెలిపారు. ఇతను ఇలా పిల్లలపై దాడులు చేయడం ఇదే మొదటి సారి కాదు.గతంలో చాలా సార్లు చేశాడు. ఈ సీసీ ఫుటేజీలు కూడా వెలుగులోకి వచ్చాయి.  అతను మానసిక స్థితి సరిగా లేదని, ప్రస్తుతం ఒక సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స పొందుతున్నాడని అతని కుటుంబ సభ్యులు  చెబుతున్నారు.     

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని, చికిత్స నిమిత్తం మదురై పంపేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేయడం పట్ల బాలుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.