Suryapet Son Murder News:  సూర్యాపేట జిల్లాలో ఇటీవల ఓ యువకుడి శవం లభ్యం అయిన కేసులో పూర్తి వివరాలను పోలీసులు చేధించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యం పహాడ్‌ సమీపంలోని మూసీ నదిలో అక్టోబరు 19న ఓ గుర్తు తెలియని శవం దొరికింది. తొలుత అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులకు కీలక వివరాలు తెలిశాయి. కొడుకు చేస్తున్న పిచ్చి పనులు, వికృత చేష్టలు భరించలేని తల్లిదండ్రులే అతణ్ని అంతం చేయించినట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఇలాంటి కొడుకు ఉన్నా, లేకపోయినా ఒకటే అనే ఉద్దేశంతో చంపించినట్లుగా తేల్చారు. యువకుడి మేనమామ (తల్లి సోదరుడు) ద్వారానే కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి ఈ పని చేయించారు. 


హుజూర్‌ నగర్‌ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పట్టణానికి చెందిన క్షత్రియ రామ్‌ సింగ్‌, రాణిబాయి దంపతులకు ఓ కుమారుడు 26 ఏళ్ల సాయినాథ్‌ ఉన్నాడు. ఓ కుమార్తె కూడా ఉంది. ఉద్యోగం రీత్యా రామ్‌సింగ్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్‌ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఉన్నత విద్యావంతుల కుటుంబం అయినా వారి కొడుకు సాయినాథ్ డిగ్రీ మధ్యలోనే ఆపేసి, జులాయిగా తిగడం మొదలు పెట్టాడు. చెడు వ్యసనాలకు కూడా బానిసయ్యాడు. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. 


రోజూ నాలుగేళ్ల నుంచి డబ్బుల కోసం తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. అతని పిచ్చి చేష్టలు మితిమీరిపోయి ఇటీవల కన్న తల్లి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కుమారుడి పైన వారికి విరక్తి కలిగిపోయింది. ఎలాగైనా చంపేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసం ఉంటున్న రాణిబాయి తమ్ముడు (సాయినాథ్ మేనమామ) సత్యనారాయణ సింగ్‌కు ఈ విషయం చెప్పారు. 


దీంతో సత్యనారాయణ సింగ్‌ తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ ను కలిశాడు. అదే తండాకు చెందిన నాగరాజు, రాంబాబు, రాజేంద్రనగర్‌కు చెందిన ధనావత్‌ సాయితో రూ.8 లక్షలకు హత్య చేసేందుకు రవి ఒప్పందం చేసుకున్నాడు. అక్టోబరు 18న సత్యనారాయణ సింగ్‌, రవి కలిసి పార్టీ చేసుకుందామని, సాయినాథ్‌ ను తీసుకెళ్లారు. 


అందరూ కలిసి ఫూటుగా తాగి సాయినాథ్‌ మెడకు ఉరి బిగించి చంపేశారు. కారులో సాయినాథ్ శవాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో విసిరేశారు. ఆ మరుసటి రోజే శవం నదిలో తేలింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టగా.. అసలు విషయం తెలిసింది. మీడియా ద్వారా విషయం తెలిసిందంటూ మూడు రోజులకు తల్లిదండ్రులు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. సీసీటీవీ కెమెరాల రికార్డులను పరిశీలించిన పోలీసులు హత్య రోజు శూన్యం పహాడ్‌ వద్ద కనిపించిన కారు మృతుడి తల్లిదండ్రులు తీసుకొచ్చిన కారు ఒకటేనని గుర్తించారు. ఆ ఆధారం ద్వారా వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా కొడుకును తామే చంపించినట్లు ఒప్పుకొన్నారు.