Khammam Newly Married Man Suicide:

  అది పెళ్లి వారి ఇల్లు. వైభవంగా వివాహం జరిగి రెండు రోజులే అయింది. ఇంతలో పెను విషాదం.. రెండు రోజులకే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరమైన ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు.


వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన కమ్మంపాటి నరేశ్ అనే 29 ఏళ్ల వ్యక్తికి, ఏపీలో ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన అమ్మాయితో మే 4న పెళ్లి జరిగింది. 5వ తేదీన అమ్మాయి స్వగ్రామంలో రిసెప్షన్ కూడా పెట్టారు. ఈ వేడుకల్లో పెళ్లి కొడుకు చాలా ఉత్సాహంగా కనిపించాడు. స్నేహితులు, బంధువులతో కలిసి డాన్సులు చేశాడు. పెళ్లి, రిసెప్షన్ హడావుడి ముగిశాక విజయవాడ గుణదలకు దైవ దర్శనానికి ఫ్యామిలీ మొత్తం వెళ్లాలని అనుకున్నారు. అందుకోసం తెల్లవారుజామునే బయలుదేరాలని, అద్దె కారు కూడా మాట్లాడుకున్నారు. దీంతో పొద్దున్నే లేచి స్నానాలు కూడా చేశారు. 


కానీ, నవ వరుడు నరేశ్ మాత్రం కనిపించలేదు. మరో బాత్రూం తలుపు వేసి ఉండడంతో దాన్ని పగలగొట్టి చూసేసరికి నరేశ్ రక్తపు మడుగులో ఉన్నాడు. బ్లేడుతో చెయ్యి, గొంతు కోసుకొని చనిపోయి ఉన్నట్లుగా గుర్తించారు. పెళ్లి కుమారుడు అలా ఎందుకు ప్రాణాలు తీసుకున్నాడో ఎవరికీ అంతుపట్టలేదు.


నరేశ్ తండ్రి నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి నాగమ్మ ఆశా వర్కర్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. చిన్న కొడుకు అయిన నరేశ్‌ (29) 2014లో బీటెక్‌ పూర్తిచేశాడు. ప్రస్తుతం గ్రూప్‌ –1, ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు సిద్ధమవుతూనే ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. పెళ్లికి ముందు, తర్వాత బంధువులు, స్నేహితులతో చాలా సంతోషంగా గడిపిన నరేష్ ఉన్నట్టుండి ఇంత దారుణ స్థితిలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.