Khammam: ఖమ్మం జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పశువుల మేత కోసం ఓ వ్యక్తికి కష్టపడి ఏర్పాటు చేసుకుంటున్న గడ్డి వాము ప్రతి సంవత్సరం ఓకే సమయంలో కాలిపోతుండగా.. అందుకు కారణం తెలుసుకున్న ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ఆ గడ్డి వాము ప్రతి ఏటా ఎందుకు తగలబడుతోందో తెలుసుకున్న ఆయన ఊరందర్నీ పిలిచి విషయం చెప్పాడు. ఆ తర్వాత అందుకు కారణమైన వ్యక్తిని పట్టుకొని కట్టేసి చితక్కొట్టారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బొక్కలతండాకు చెందిన వాంకుడోతు బాబులాల్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. వరి పండించి పంట నూర్పిడి తర్వాత ఆ గడ్డిని తీసుకొచ్చి ఇంటి ఆవరణలో వాము ఏర్పాటు చేసుకునేవాడు. ఆ గడ్డి వాముకు కొన్నేళ్లుగా ఏటా ఏదో ఒకరోజు మంటలు అంటుకునేవి. తనకే ఎందుకిలా అవుతుంది.. ఇతరుల వాములు అన్నీ బాగానే ఉన్నాయని బాధితుడు తెగ మథనపడిపోయేవాడు. కానీ, ఇవి కరెంటు వైర్ల వల్లో లేదా ప్రమాదవశాత్తు జరుగుతున్న ఘటనలు కావని మాత్రం గ్రహించాడు. తన వామును ఎవరో గిట్టని వారు తగలబెడుతున్నారని బాగా అనుమాన పడ్డాడు. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని నిర్ధారణకు వచ్చారు. 


సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
ఎవరికీ తెలియకుండా ఒకరోజు ఇంటి ఆవరణలో గడ్డి వాము చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. కొద్ది రోజులకు ఎప్పటిలానే ఈసారి కూడా అతని గడ్డి వాము మంటల్లో కాలిపోయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలించగా.. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి కెమెరా కంటికి దొరికిపోయాడు. విషయం తెలియని నిందితుడు ఎప్పటిలానే ఆదివారం ఉదయం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో గడ్డికి నిప్పటించాడు. ఎగిసిపడ్డ మంటలను గమనించిన బాధితుడు బాబూలాల్‌ చుట్టుపక్కల వారి సాయంతో ఆ మంటలను ఆర్పివేశాడు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అదే తండాకు చెందిన బుచ్చా అనే వ్యక్తి గడ్డి వాముకు అగ్గిపెట్టెతో నిప్పు అంటించినట్లుగా కనిపించింది. 


దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు స్థానికులకు విషయం చెప్పి బుచ్చాను అదుపులోకి తీసుకుని ఓ గుంజకు కట్టేశారు. చితక్కొ్ట్టి అనంతరం పంచాయతీ పెట్టారు. ఈ ఫుటేజీ వాట్సాప్‌లో వైరల్‌ కావటంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి న్యాయం చేసే ప్రయత్నం చేశారు.