Boy Dies in Dogs Attack In Khammam: గత కొన్ని రోజులుగా వీధి కుక్కల దాడులు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి వీధి కుక్కలు. ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడు కుక్కల దాడిలో మృతిచెందిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో ఈ విషాదం జరిగింది. బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్(5) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అంతలో వీధి కుక్కలు భరత్ పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ బాలుడికి స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించారు.


మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు డాక్టర్లు. వారి సూచన మేరకు బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందినట్లు సమాచారం. కుమారుడి మృత‌దేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాజా ఘటనతో స్థానికంగా ప్రజలలో వీధి కుక్కలపై భయాందోళన వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి తమ గ్రామంలో కుక్కల దాడులు జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని, సాధ్యమైతే కుక్కలు లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


బాలికపై కుక్కల దాడి, కాపాడిన స్థానికుడు
సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర ఓ బాలికపై వీధి కుక్కలు రెండు దాడికి యత్నించాయి. ప్రాణ భయంతో విద్యార్థిని కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. ఓ వైపు భయం వేస్తున్నా కుక్కల నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టింది. ఆమె కేకలు విన్న స్థానిక మెకానిక్ బాలికను కాపాడారు. కుక్కలు బాలికపై దాడికి యత్నించడం, ఆపై ఓ వ్యక్తి కుక్కుల బారి నుంచి ఆమెను కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలిక ప్రాణాలు కాపాడిన వ్యక్తి తిరుపతిని నెటిజన్లు ప్రశంసించారు.  


ఎంపీపీ భర్తను కరుస్తుండగా సీసీటీవిలో రికార్డైన దృశ్యాలు 
ఈ నెల మొదట్లో నిర్మల్‌ జిల్లా బాసర మండలం బిడ్రేల్లీలో బాసర ఎంపీపీ భర్త విశ్వనాథ్ పటేల్‌ పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై ఆయన నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి ఓ వీధి కుక్క వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో విశ్వనాథ్ పటేల్‌కు గాయాలు కాగా... విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ‌అయితే వీధి కుక్క దాడి చేసిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వెనక నుంచి కుక్క రావడాన్ని విశ్వనాథ్ గమనించలేదు. వెనుక నుంచి మెళ్లిగా  వచ్చిన శునకం విశ్వనాథ్ కాళ్లను పట్టుకుంది. కుక్క గట్టిగా కరవడంతో విశ్వనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి విషయం గుర్తించి తరమడంతో అక్కడ నుంచి కుక్క పారిపోయింది.


ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. మొత్తం రూ.10 లక్షలను బాలుడి కుటుంబానికి అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ రూ.8 లక్షలు, కార్పొరేటర్ల జీతం నుంచి రూ.2 లక్షల రూపాయాలు కలిపి మొత్తం పది లక్షల రూపాయాలను కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి పరిహారంగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. కుక్కల బెడదపై కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైదరాబాద్‌లో (GHMC) పరిధిలో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో  నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌ చనిపోవడం తెలిసిందే.