పిల్లలు లేని తల్లిదండ్రులకు శివువులను అమ్ముతున్న ఓ ముఠాను ఖమ్మం నగరానికి చెందిన అధికారులు పట్టుకున్నారు. తాము పిల్లలు లేని వారిగా ఆ ముఠాకు పరిచయమై రెడ్‌ హ్యాండెడ్‌గా వీరిని పట్టుకుని కటకటాలకు పంపించారు. ఖమ్మం నగరంలో జరిగిన ఈ సంఘటనలకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.


పిల్లలు లేని వారు దత్తత చేసుకునేందుకు అధికార ప్రక్రియపై అవగాహన లేని వారు కొందరు దళారులను ఆశ్రయిస్తున్నారు. పిల్లలపై వీరికున్న మమకారాన్ని ఆసరాగా చేసుకుని ఓ ముఠా చిన్న పిల్లలను లక్షల రూపాయలు తీసుకుని విక్రయిస్తున్నారు. ఖమ్మం నగరం వికలాంగుల కాలనీకి చెందిన ఉప్పతల పుల్లారావు, అద్దంకివారి వీదికి చెందిన మోదుగు మేరీలు నవజాత శిశువులు, చిన్న పిల్లలను అమ్ముతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్‌ కేర్‌ సెంటర్‌ 1098 కోఆర్డినేటర్‌ కువ్వారపు శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన శ్రీనివాస్‌ చైల్డ్‌లైన్‌ ఉన్నతాధికారు లతోపాటు యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ సీఐ నవీన్, సీడీపీవో కవితకు సమాచారం అందించారు. ఈ విషయంపై పకడ్బందీగా దాడులు చేయాలని నిర్ణయించుకున్న అధికారులు మూడు శాఖల అధికారుల సమన్వయంతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు.


పిల్లలు లేని వారిగా నటించి..
మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు అనూష, నరిసింహారావు, బాస్కర్‌లు ఓ బృందంగా ఏర్పాటై తమకు పిల్లలు లేని చెప్పి మేరీతో పరిచయం చేసుకున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు తమకు పిల్లలు కావాలని ఆమెను ప్రాధేయ పడ్డారు. వీరి మాటలు నమ్మిన మేరి ఆమె పలువురు పసిపిల్లల ఫోటోలన వీరికి వాట్సాప్‌ చేసి అందులో రేటు కూడా నిర్ణయించింది. ఇటీవల ఓ పాపను విక్రయించినట్లు చెబుతూ చేసిన బాండ్‌ పేపర్‌ను కూడా చూపించి వారికి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని నమ్మబలికించింది. ఈ వివరాలు అధికారుల బృందం గుట్టుచప్పుడు కాకుండా నమోదు చేశారు. 


ఇదే క్రమంలో ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని ఓ ఆసుపత్రిలో మూడో కాన్పులో ఆడపిల్ల జన్మించిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే శిశువును అప్పగిస్తామని ఇందుకోసం రూ.4 లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్‌గా రూ.1.50 లక్షలు ఇవ్వాలని సూచించింది. దీంతో అనూష బృందం వీటికి అంగీకరించి నగదు బాండ్‌ పేపర్లతో మేరీ సూచించిన ప్రాంతానికి వెళ్లగా అక్కడ వెంటనే టూటౌన్‌ పోలీసులు మోదుగు మేరీతోపాటు శిశువును అమ్మేందుకు ముందుకు వచ్చిన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై సమగ్రంగా ధర్యాప్తు చేస్తున్నారు. శిశువుల విక్రయానికి సంబందించిన ముఠాను స్ట్రింగ్‌ ఆపరేషన్‌తో చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని చైల్డ్‌లైన్‌ అధికారులు అబినందించారు.