మొబైల్ కు ఎడిక్ట్ అయిన ఓ యువకుడు తన తల్లినే చంపేశాడు. ఫోన్ వాడొద్దని చెప్పిన పాపానికి వృద్ధురాలైన తల్లి తలను పట్టుకుని గోడకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన కేరళలో జరిగింది.


ఏం జరిగిందంటే.?


కేరళ కన్నూర్ జిల్లా కినిచిరా గ్రామానికి చెందిన రుక్మిణీదేవి (63), తన తల్లి సుజీత్ తో కలిసి ఉంటోంది. కాగా, సుజీత్ మొబైల్ కు బానిసగా మారాడు. ఈ వ్యసనం నుంచి బయటకు తీసుకు రావాలని తల్లి మొబైల్ వాడకం తగ్గించాలని సుజీత్ ను కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన సుజీత్ తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తల్లి తలను పట్టుకుని గోడకేసి కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా ఓ వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.


నిందితుడు మానసిక రోగి


పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు మానసిక రోగి అని, వైద్య నివేదికను చూసిన కోర్టు అతన్ని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితుడికి చాలా కాలంగా మొబైల్ అడిక్షన్ ఉందని పోలీసులు తెలిపారు. గతంలోనూ ఓసారి అడిక్షన్ సెంటర్ లో చేరాడని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే వ్యసనానికి గురైనట్లు పేర్కొన్నారు. నిందితుడు నేరం అంగీకరించాడని, తానేం చేస్తున్నాడో తెలియడం లేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.


పెళ్లి చేయలేదని తండ్రినే చంపేశాడు


మరోవైపు, ఏపీలోనూ శనివారం దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి అనే వ్యక్తిని అతని కుమారుడు గురు నారాయణ కత్తితో దాడి చేసి చంపేశాడు. తనకు పెళ్లి చేయడం లేదనే మనస్తాపంతో పథకం ప్రకారం తండ్రిని బయటకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.