Kerala Human Sacrifice Case:
శ్రీదేవి పేరిట ఫేక్ అకౌంట్..
కేరళలో సంచలనం సృష్టించిన "నరబలి" ఘటనలో విచారణ జరుపుతున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేరం వెనక ప్రధాన సూత్రధారి మహమ్మద్ షఫీ అని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్న విషయం. సోషల్ మీడియా ద్వారా దంపతులకు పరిచయమై... తరవాత వాళ్లతో ఈ నరబలి చేయించాడని పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో "శ్రీదేవి" పేరుతో అకౌంట్ మెయింటేన్ చేశాడు మహమ్మద్ షఫీ. పూల ఫోటోలను డీపీగా పెట్టుకుని మభ్యపెట్టాడు. తరవాత ఆ దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను బాబాగా చెప్పుకున్నాడు. "దురదృష్టం తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలి" అని వారికి మాయమాటలు చెప్పాడు. అంతే కాదు. నిందితులైన భగవల్ సింగ్ భార్యతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పూజలో భాగమే అని వాళ్లను నమ్మించాడు కూడా. అయితే..పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలు లభించాకే ఇది నిజమా కాదా అని నిర్ధరించే అవకాశముంది. అటు నిందితుల తరపున న్యాయవాది "మృతుల మాంసాన్ని తిన్నారు" అన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇటు పోలీసులకూ దీనిపై పూర్తి ఆధారాలు లభించలేదు. ఈ నరబలిలో మృతి చెందిన ఇద్దరి మహిళల డెడ్‌బాడీలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు.
దారుణంగా హత్య..
ఇద్దరి మహిళల ప్రైవేట్ పార్ట్స్‌లో కత్తులు దూర్చారని, గొంతుని చీల్చారని, ముక్కలుగా చేశారని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళ ఛాతీ భాగాన్ని కోశారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు నిందితులనూ 12 రోజుల కస్టడీలో ఉంచారు. కేరళ హైకోర్ట్ కూడా ఈ ఘటనపై స్పందించింది. "సోషల్ మీడియాలో మూఢనమ్మకాలపై విపరీతంగా ప్రచారం జరుగుతుండటమూ ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది" అని వ్యాఖ్యానించింది.
56 ముక్కలుగా చేసి..
ఓ జంట ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా హత్య చేశారు. నరబలి ఇస్తే సంపన్నులైపోతామని నమ్మిన దంపతులు...ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడమే కాకుండా...శరీరాన్ని 56 ముక్కలుగా కోశారు. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే...వాళ్ల మాంసాన్ని కూడా తిన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రోసెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు చిత్రహింసకు గురై మృతి చెందారని విచారణలో తేలింది. చేతులు వెనక్కి కట్టేసి ఛాతీ భాగంపై తీవ్రంగా గాయం చేసి, కావాలనే రక్తంపోయే వరకూ హింసించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసి మూడు గోతులు తవ్వి వాటిలో ఆ అవయ వాలను పాతి పెట్టారు. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులను విచారిస్తున్న సమయంలోనేపోలీసుల ప్రశ్నలకు సమాధానంగా "మేం వాళ్ల మాంసాన్ని తిన్నాం" అని షాకింగ్ సమాధానమిచ్చారట. అయితే...పోలీసులు మాత్రం దీన్ని ఇంకా నిర్ధరించలేదు. "ఇది నిరూపించాలంటే మాకు ఆధారాలు దొరకాలి" అని వెల్లడించారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. మృతుల్లో ఒకరైన రోసెలిన్ జూన్‌లో కనిపించకుండా పోయింది. ఆ తరవాత సెప్టెంబర్‌లో పద్మ మిస్సింగ్ అయినట్టు తేలింది.