సామాజిక మాధ్యమాల ద్వారా తరచుగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న సయ్యద్ అబ్దాహూ ఖాద్రి అలియాస్ కషాఫ్ అనే ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కషాఫ్ హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈనెల 22, 23వ తేదీలలో హైదరాబాద్ సీపీ కార్యాలయం ముందు కషాఫ్ ధర్నా నిర్వహించినట్లు వివరించారు. ధర్నాలో పాల్గొన్న ముస్లిం యువకులతోపాటు కషాఫ్... "సర్ తాన్ సే జూడ" వాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినందుకుగాను కషాఫ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కషాఫ్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.


పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!


కషాఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యువకులు రెచ్చిపోయి అల్లర్లు చేశారు. మొగల్పుర, భవానీ నగర్, హుస్సేనీ ఆలం, షహనద్గoజ్ పోలీస్ స్టేషన్ లలో హింసకాండను సృష్టించారు. పోలీస్ వాహనాలు ధ్వంసం చేశారు. అంతే కాకుండా పోలీసులపై రాళ్లు రువ్వారు. ఒక క్యాబ్ డ్రైవర్ తోపాటు హోటల్ సిబ్బందిపై కూడా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేశారు. యువకుల ఆందోళనలకు భయపడి పలుచోట్ల దుకాణాలు మూసివేశారు. కశ్యప్ ఇప్పటి వరకు మొత్తం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మూడు కేసుల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టినవే కావడం గమనార్హం. గతంలో ఎన్నికల సమయంలో షబ్బిర్ ఆలీపై దాడి చేసిన ఘటనలోనూ కషాఫ్ నిందితుడిగా ఉన్నాడు. అందుకే కషాఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలిచారు. 


బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ అయినప్పటి నుంచి కషాఫ్ మరిన్ని వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు ప్రతీరోజూ ధర్నాలు చేస్తూ భాగ్యనగరంలో హింసాకాండ సృష్టిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ సపోర్టింగ్ గా కొందరు నిరసనలు చేస్తుండగా.. మరికొందరేమో అతన్ని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. 


పలు సెక్షన్ల కింద కేసులు నమోదు...  


ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రెండు కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పీడీయాక్ట్ పెట్టారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ సహా షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లలో నమోదైన కేసులలో అరెస్టు చేశారు. ఒకరోజు ముందు  41 (ఏ) సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి. మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో, షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 19, 2022న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మంగళ్‌హాట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏప్రిల్‌ 12న షా ఇనాయత్‌గంజ్‌లో కేసు మరో కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల వేళ, శ్రీరామ నవమి సందర్భంగా వివాదాస్పద కామెంట్స్ చేశారని ఈ ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 153(A), 295(A), 504, 505(2) కేసులు రిజిస్టర్ చేశారు. ఈ కేసులకు సంబంధించి సీఆర్‌పీసీ-41(A) కింద నోటీసులు రాజాసింగ్‌కు ఇచ్చారు.