Karimnagar Rowdy Sheeters: కరీంనగర్ సిటీ లో మళ్లీ రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. గతంలో కొన్ని నెలల పాటు గ్యాంగ్ వార్ లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించాయి. ముఖ్యంగా లవన్ అనే రౌడీషీటర్ అనేక గొడవలు, భూకబ్జాలు బలవంతపు వసూళ్లపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే లవన్ స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఓ రిటైర్డ్ ఎస్సై కుమారుడు కావడంతో అప్పట్లో కొద్దిరోజుల పాటు అతని హవా నడిచింది. 


బర్త్ డే సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు గూమి గూడి 2019లో కత్తులతో బర్త్ డే  సెలెబ్రెట్ చేస్తూ రోడ్డుపైనే డాన్స్ చేయడంతో  స్థానికులు అతనిపై ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బర్తడే పార్టీలో  పలువురు గ్యాంగ్ మెంబర్ల ని అరెస్ట్ చేశారు. అయితే కీలక సూత్రధారి అయిన లవన్ మాత్రం తప్పించుకున్నాడు. అప్పటి నుండి అనేక కేసులు బయటకు వచ్చాయి. పక్క ఊర్ల నుండి కూడా ప్రజలు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. దీంతో అప్పటి సిపి వి.కమలాసన్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ అతని నేరాలకు ముఖ్యంగా అడ్డుకట్ట వేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో లవన్ సిరిసిల్ల కోర్టులో  లొంగిపోయాడు. లవన్ అప్పట్లో కరీంనగర్ సిటీకి దూరంగా హైదరాబాద్ ఉండడం ప్రారంభించాడు.


మళ్లీ ఏం జరిగింది
మరోవైపు గురువారం ఉదయం రెండుగంటల ప్రాంతంలో కరీంనగర్ కి బార్డర్ లో ఉన్న ఓ దాబాలో లవన్ తన అనుచరులతో కలిసి అఖిల్ అనే యువకుడిపై దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా తన గ్యాంగ్ మెంబర్లకు ఫోన్ చేసి మరీ తల్వార్లు తీసుకు రావాలంటూ ఆదేశించాడు. అక్కడకు వచ్చిన గ్యాంగ్ మెంబర్లు అందరు కలిసి ఆ యువకుడు పై దాడికి దిగారు. దీంతో పక్కన ఉన్న వారు సైతం వారించడానికి ప్రయత్నించగా వారికి సైతం కత్తి వల్ల గాయాలు అయ్యాయి. వన్ టౌన్ కి చెందిన పోలీసులు  ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించడానికి దాబా సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్ ని తీసుకొని వెళ్లారు. అయితే రెండు రోజులపాటు సైలెంట్ గా ఉండడం కొంతవరకు అనుమానాలను రేకెత్తించింది. ఈ విషయం ఇతర వర్గాలద్వారా సి పి సత్యనారాయణకు తెలియడంతో దీనికి సంబంధించి సదరు అధికారులను పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 


తాను హైదరాబాదులో ఉంటున్నాను అంటూ గతంలో పోలీసుల ముందు కౌన్సిలింగ్ కు హాజరైన లవన్ చెప్పగా పోలీసులు కూడా అతని మాటలు నమ్మారు. ప్రస్తుతం తిరిగి పాత మార్గంలోనే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నెలలో కొద్దిరోజులపాటు ఇక్కడికి వస్తూ ల్యాండ్ సెటిల్మెంట్లు ఇతర దందాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి గ్యాంగ్ మెంబర్స్ అందర్నీ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.


Also Read: Electric Bike Blast: తమిళనాడులో విషాదం - బ్యాటరీ బైక్ పేలడంతో తండ్రి, కూతురు మృతి 


Also Read: Bhadradri Kothagudem: విషాదంగా మారిన జంతువుల వేట - ఒకరు కరెంట్ షాక్‌తో ! భయంతో మరో వ్యక్తి మృతి