Karimnagar Accident : కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్మనగర్ బై పాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ మృతి చెందారు.  కరీంనగర్ పట్టణంలోని అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్న బండ  రజిత... ఇల్లంతకుంట మండలం మోడల్ స్కూల్లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె శుక్రవారం ఉదయం తన స్కూటీ పై వెళ్తూ పద్మ నగర్ లోని బై పాస్ రోడ్డు పక్కనున్న ప్రైవేట్ స్కూల్ వద్ద తన వాహనాన్ని నిలిపే సమయంలో వెనుక నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ స్కూటీని ఢీకొనడంతో రజిత అక్కడికక్కడే మృతి చెందారు. రజిత స్వగ్రామం శంకరపట్నం మండలం గద్దపాక గ్రామం, మృతురాలి భర్త.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ దగ్గర అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తుండేవారు. 8 సంవత్సరాల క్రితం రజిత భర్త హార్ట్ ఎటాక్ తో  మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. మహిళా టీచర్ తల్లిదండ్రులు ప్రమాదం తెలిసి ఘటనాస్థలికి వస్తున్న క్రమంలో వారు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  రజిత  తండ్రికి చేతికి గాయం కావడంతో ఆయనను హాస్పిటల్ కి తరలించారు.  


చిత్తూరు జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం 


చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గంగవరం మండలం గాంధీనగర్ వాసులుగా గంగవరం పోలీసులు గుర్తించారు. వనిత(32), చారునేత్ర(8)లు చీలవారిపల్లెకి వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా దూసుకొచ్చిన లారీ వారిని ఢీ కొనడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై  పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


బోల్తా పడిన బొలెరో వాహనం 


చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కృష్ణరాజపురం సమీపంలో జాతీయ రహదారిపై బొలెరో వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన గాయపడిన వారిని కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 


 భీంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం 


నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. భీమ్‌గల్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు స్వల్ప గాయలతో బయట పడ్డారు. గాయపడిన వారిలో మహిళల, వ్యక్తితో పాటు ఇద్దరు చిన్నారులు సేఫ్ గా బయట పడ్డారు. మోర్తాడ్ మండలానికి చెందిన వారు భీమ్‌గల్ మండలం బడా భీంగల్ ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లి తిరిగి ఏపీ 09 బీఈ 7661 నెంబర్ గల కారులో తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో భీమ్‌గల్ సబ్ స్టేషన్ వద్ద జేసీబీని ట్రాక్టర్ ట్రాలిపై తీసుకువస్తున్న ట్రాక్టర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ తో పాటు ట్రాలీపై ఉన్న జేసీబీ కారుపై పడింది. దాంతో కారులో ఉన్న ముగ్గురు వడ్ల రాజేశ్వర్, జ్యోతి ( దోన్కల్ ), గోవింద్ పేట్ కు చెందిన రమ అక్కడికక్కడే మృతి చెందారు. కారుపైనే ట్రాక్టర్ ఇంజిన్ తో పాటు జేసీబీ మొత్తం పడిపోయాయి. కారుపై పడిన వాటిని తీసేందుకు మరో మూడు జేసీబీలను తెప్పించారు. జేసీబీల సహాయంతో కారులో ఇరుకున్న ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరిని రక్షించి 108 లో ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు.