Karimnagar News : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. డిఫెన్స్ కోచింగ్ అకాడమీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులతో మాట్లాడి వారికి అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం, సిటీ చుట్టుపక్కల ఉన్న పలు డిఫెన్స్ అకాడమీల్లో పోలీసులు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎప్పుడైనా,  ఎలాంటి దుచ్చర్యలకు పాల్పడినా భవిష్యత్ ని  నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ రోజుల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ అలాంటి వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. 


డిఫెన్స్ కోచింగ్ సెంటర్లపై ఆరా 


మరోవైపు కరీంనగర్ లోని ఇనిస్టిట్యూట్లపై కూడా వార్తలు వస్తున్నాయని దీనిపై కూడా విచారిస్తున్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో  ఆందోళనల్లో పాల్గొన్న వారిని పట్టుకోవచ్చు అని అందుకే తొందరపడి ఎలాంటి సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని విద్యార్థులను ఉద్దేశించి హెచ్చరించారు. మరోవైపు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో డిఫెన్స్ అకాడమీలపై ఆరా తీస్తున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. 


సికింద్రాబాద్ ఘటన 


అగ్నిపథ్, పరీక్షల నిర్వహణ ఆలస్యం అవుతున్న కారణాలతో ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. రైళ్ల బోగీలను తగలబెట్టారు. స్టాళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వెనక్కి తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఓ కోచింగ్ సెంటర్ నిర్వహకుడుని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై కోచింగ్ సెంటర్ల నిర్వహకులు, అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. వారికి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అల్లర్లలో కేసులు నమోదు అయితే జీవితంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించలేరని తెలిపారు. 


అగ్నిపథ్ పై కేంద్రం క్లారిటీ


అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న క్రమంలో కేంద్రం అన్ని విధాలా వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియామక ప్రక్రియను నిలిపివేసే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీలోని ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పథకంలోని ప్రయోజనాలను వివరించారని సూచించారు. అగ్నిపథ్​ అమలుకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. రాజ్ ​నాథ్​ సింగ్ నిర్వహించిన సమావేశంలో కూడా అగ్నిపథ్ అమలుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నిరసనకారులను ఎలా శాంతింపజేయాలి అన్న విషయంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అగ్నిపథ్​ నోటిఫికేషన్ కూడా​ త్వరలోనే వస్తుందని, డిసెంబర్​ నాటికి ట్రైనింగ్​ ప్రక్రియ ప్రారంభమవుతుందని త్రివిధ దళాల అధిపతులు ఇప్పటికే స్పష్టం చేశారు.