దూరపు బంధువులైన ఆ ఇద్దరు యువకులు తమ ఇరువురి కుటుంబాల్లోనూ ఒక్కగానొక్క కుమారులు. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. సరదాగా గడిపే ఏజ్ లో భోజనం కోసం చేసిన చిన్న ప్రయాణం వారిని మృత్యువు వైపు లాక్కెళ్ళింది. ఇద్దరు స్నేహితులుగా మారక ముందే బంధుత్వం ఉండటంతో అది మరింత బలపడి తరచూ ఇద్దరూ కలిసి అనేక కార్యక్రమాలకు హాజరయ్యేవారు. మరోవైపు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కోరుట్ల పట్టణానికి చెందిన మండలోజు అనిల్, బెజ్జారపు సుమంత్ లు లారీని ఢీకొని సజీవ దహనం అయ్యారు. ఉన్నత విద్యావంతులైన ఇద్దరు చేతికొచ్చిన కొడుకులు ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనం అయిన ఘటన ఆ కుటుంబాల్లో తీరని తీవ్ర విషాదాన్ని నింపింది. 


వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణానికి చెందిన బెజ్జారపు శ్రీనివాస్ - మాధురి దంపతులకు సుమంత్ తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మధ్యనే సుమంత్ B.Sc (Dialysis)  కోర్సు పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. మరోవైపు స్వర్ణకార వృత్తి చేసే మెట్ పల్లి మండలం వెల్లుల్ల చెందిన మండలం నారాయణ - విజయ దంపతులకు కూడా ఒక కుమారుడు,  ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కులవృత్తిలో తండ్రికి చేదోడువాదోడుగా అనిల్ ఉంటున్నాడు. ఈ ఇద్దరు యువకులు కూడా మంచి స్నేహితులు. 


ఆదివారం సాయంత్రం సుమంత్ మెట్ పల్లికి వెళ్లి అనిల్ ని కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ అర్ధరాత్రి వరకూ అక్కడే గడిపి తరువాత భోజనం కోసం నిజామాబాద్ వైపు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. తమ బంధువుల కారు తీసుకుని పెర్కిట్ వైపు వెళ్తుండగా మోర్తాడ్ వద్ద కారు లారీని ఢీ కొట్టి పక్కన ఉన్న గొయ్యిలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది. అందులో మంటలు చెలరేగడంతో బయటకు రాని పరిస్థితుల్లో అనిల్ సుమంత్ ఇద్దరూ కారులోనే కాలిబూడిదయ్యారు. అయితే పూర్తిగా కారు తో బాటు మృతదేహాలు కాలిపోవడంతో అందులో ఉన్న వారిని గుర్తించడం కాస్త ఆలస్యం అయింది.


ఇక సోమవారం ఉదయం ఈ వార్త పోలీసుల ద్వారా కన్ఫామ్ కావడంతో బంధుమిత్రులు అంతా హుటాహుటిన వెళ్లి తమవారేనని నిర్ధారించుకున్నారు. జీవితంలో ఉన్నత విద్యను పూర్తి చేసి ఇప్పుడిప్పుడే తమ తమ వృత్తుల్లో సెటిల్ అవుతూ, ఎన్నో కలలు కంటున్న ఇద్దరు యువకులు చివరికి ప్రాణాలు కోల్పోయారు. వారి రెండు కుటుంబాల్లోనూ ఒక్కడే కుమారుడు ఉండడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.