Kamareddy News : కారు కొనుక్కొని కిరాయిలకు తిప్పుతూ ఉపాధి పొందాలని భావించాడో యువకుడు. కారు కొనుగోలుకు ఓ షోరూమ్ వెళ్లాడు. ఈఎమ్ఐల రూపంలో కారు కొనుగోలు చేసేందుకు డౌన్ పేమెంట్ చెల్లించాడు. కానీ కారు డెలివరీ చేయలేదు షోరూమ్ నిర్వాహకులు. అందుకు మనస్తాపంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారును అనుకున్న సమయానికి డెలివరీ ఇవ్వలేదన్న క్షణికావేశంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. 


అసలేం జరిగింది? 


కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కల్యాణి గ్రామానికి చెందిన తెలగాపురం కృష్ణ(21) కారు కొనుక్కొని స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఎల్లారెడ్డిలోని ఓ కారు షోరూమ్ లో కారు కొనుగోలుకు సంప్రదించాడు. అయితే షోరూమ్ నిర్వాహకులు కారు ధర రూ.8.71 లక్షలని, రూ.2.5 లక్షల డౌన్​ పేమెంట్ చెల్లించాలని ముందుగా చెప్పారు. కృష్ణ మే 23న రూ.50 వేలు చెల్లించగా, మిగిలిన రూ.2 లక్షలు చెల్లించి కారు తీసుకెళ్లాలని షోరూమ్ నిర్వాహకులు సూచించారు. కృష్ణ రూ.2 లక్షలు తీసుకుని శనివారం షోరూమ్ ​కు వెళ్లాడు. 


నిరుత్సాహంతో 


అయితే షోరూమ్ నిర్వాహకులు రూ.2 లక్షలను కట్టించుకుని మరో రూ.50 వేలు చెల్లించాలని కోరారు. కారు డెలివరీ ఇవ్వడానికి సమయం పడుతుందన్నారు. దీంతో కారు  తీసుకోడానికి  షోరూమ్ కు వెళ్లిన కృష్ణకు నిరాశే ఎదురైంది. కారు డెలవరీ ఆలస్యం అవుతుందన్న నిర్వాహకుల మాటలతో నిరాశ చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు యువకుడు. షోరూమ్​ నిర్వాహకులు తనను మోసం చేశారని ఆదివారం తన ఇంట్లో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


సాఫ్ట్ వేర్ యువతి సూసైడ్


గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరుకి చెందిన జాస్తి శ్వేత (22) సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తోంది. మూడు నెలల కిందటి నుంచి వర్క్ ఫర్ హోమ్ చేస్తోంది. ఈ క్రమంలో  హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆమె ఉద్యోగంలో చేరాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉద్యోగంలో జాయిన్ అవుతానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. జగ్గయ్యపేట రూరల్ మండల పరిధిలోని చిల్లకల్లులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత మిస్ అయింది. జాబ్‌లో చేరేందుకు హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన శ్వేత శనివారం సాయంత్ర స్కూటీపై బయటకు వెళ్లింది. తాను చిల్లకల్లు చెరువుతో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లి ఫోన్‌కు మెస్సేజ్ చేసింది. 


కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పోలీసులు రెస్క్యూ టీమ్‌తో కలిసి చిల్లకల్లు చెరువులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్వేత డెడ్ బాడీ కోసం గాలించారు. రాత్రి కావడంతో అధికారులు అర్ధరాత్రి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం గాలించగా శ్వేత డెడ్ బాడీ దొరికింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. 


కొన్ని రోజుల కిందట ఆమెకు ఆన్ లైన్‌లో పరిచయమైన వ్యక్తి రూ.1.2 లక్షలు చెల్లిస్తే దాదాపు రూ.7 లక్షలు వస్తాయని నమ్మించాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పగా.. రూ.50 ఇచ్చి, మిగతా నగదు కలిపి తాను చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని అపరిచిత వ్యక్తి సూచించాడు. ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో నగదు చెల్లించింది. ఆ తరువాత నుంచి ఆన్‌లైన్ ఫ్రెండ్ శ్వేత ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలో తెలియక హైదరాబాద్‌లో ఉద్యోగం అంటూ ఇంట్లో చెప్పి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం రాత్రి తల్లికి మెస్సేజ్ చేసి సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు.