ఓ యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరం మురగేష్‌ పాళ్యలోని ఎన్‌ఏఎల్‌ రోడ్డులో చోటుచేసుకుంది. లీలా పవిత్ర (28) హత్యకు గురైన యువతి. నిందితుడు దినకర్‌ ఆమెను ఛాతీ, కడుపు, మెడపై దాదాపు 16కు పైగా కత్తిపోట్లతో దారుణంగా హత్య చేశాడు.


లీలా పవిత్ర ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన యువతి. ఆమె ఒమేగా మెడిసిన్ కంపెనీలో పనిచేస్తోంది. నిన్న (ఫిబ్రవరి 28) నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్యకు గురైన యువతి, నిందితుడు దినకర్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అని అక్కడి పోలీసులు చెప్పారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం. అయితే వీరిద్దరి ప్రేమను అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. వేర్వేరు కులాల వారు కావడంతో ఇద్దరి ఇళ్లలోని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ నేప‌థ్యంలో ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని ఆమె అతనికి చెప్పింది. గత రెండు నెలలుగా దినకర్ ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. తర్వాత లీలా పవిత్రకు ఇంట్లో మరొకరితో వివాహం కుదిర్చారు. ఇది తెలిసిన నిందితుడు దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపం పెంచుకొని ఆమెను చంపేశాడు.


కంపెనీలో పని ముగించుకుని యువతి బయటకు రావడం కోసం నిందితుడు దినకర్ ఎదురు చూశాడు. యువతి బయటకు వస్తుండగా నిందితుడు ఆమెను కత్తితో 16కు పైగా పోట్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్రంగా గాయాల పాలైన లీలాను అక్కడి వారు ఆస్పత్రికి తరలించగా ఆమె మధ్యలోనే చనిపోయిందని తెలిపారు. ఇంట్లో వద్దన్న తర్వాత పెళ్లికి యువతి ఒప్పుకోకపోవడంతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.