ఇళ్ల వద్దకు వచ్చి నానా గలాటా చేస్తుందన్న కోపంతో ఊరపందిని కాల్చే ప్రయత్నం చేసిన వ్యక్తి తన నిర్లక్ష్యంతో అభం శుభం తెలియని చిన్నారిని ఉసురు పోసుకున్నాడు.. వాకిట్లో ఆడుకుంటుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన తూటా శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చి చిన్నారి బాలికను బలి తీసుకుంది.. ఈ సంఘటన కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులో మంగళవారం చోటుచేసుకుంది.. 


లోవకొత్తూరు గ్రామానికి చెందిన పలివెల రాజబాబు, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల పెద్దకుమార్తె ధన్యశ్రీ ఉదయాన్నే ఆడుకునేందుకు వాకిట్లోకి వెళ్లింది.. పక్కింటి స్నేహితులతో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం తల్లితండ్రులకు వినిపించింది. ఏదో అనుకుని తమ పనితాము చేసుకుంటుండగా పిల్లలు వచ్చి ధన్యశ్రీ రక్తం కారుతూ పడిపోయిందని తెలిపారు. పరుగున వెళ్లి చూసిన తల్లితండ్రులుకు రక్తపు మడుగులో కనిపించింది. నాటు తుపాకీ తూటా తగిలిందని గమనించిన తల్లితండ్రులు, బంధువులు హుటాహుటిన తుని ప్రభుత్వ ఆసుపత్రికి ధన్యశ్రీను తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 


పందిని కాల్చబోయి


లోవ కొత్తూరుకు చెందిన సిద్ధాంతపు దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి వద్ద నాటు తుపాకీ ఉంది.. ఇది గతంలో తమ పూర్వికులు ద్వారా ఇతని దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా పందులు నానా గలాటా సృష్టిస్తున్నాయని వాటి ద్వారా వ్యాధులు ప్రభలుతాయని అందుకే పందిని చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు దుర్గాప్రసాద్‌ తెలిపాడు. ఈ క్రమంలోనే తుపాకీని తూటా లోడ్‌ చేస్తుండగా మిస్‌ ఫైర్‌ అయ్యిందని పోలీసులకు తెలిపాడు. దుర్గాప్రసాద్‌ దగ్గరకు అసలు ఈ నాటు తుపాకీ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి వాడుతున్నాడు అనేదానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. 


అభం శుభం తెలియని చిన్నారి బలి


ఊరపందిని కాల్చేందుకు నాటు తుపాకీతో దుర్ఛర్యకు పాల్పడిన దుర్గాప్రసాద్‌ అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణంగా నిలిచాడు.. తుపాకీ అత్యంత సమీపం నుంచి కాల్చడంతో చిన్నారి వీపు భాగం నుంచి ముందుకు తూటా చీల్చుకుపోయింది. దీంతో చిన్నారి ధన్యశ్రీ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. దీంతో కళ్ల ముందే విగత జీవిగా మారిన కుమార్తె ధన్యశ్రీను చూసిన కన్నవారు, అయినవాళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈసంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తుపాకీను స్వాదీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.