Kakinada Knife Attack : కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ గ్రామంలో ప్రేమోన్మాది దాడిలో దేవకి అనే యువతి మృతి చెందింది. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సీఎం జగన్ ఆదేశించారు. త్వరతిగతిన కేసు విచారణ పూర్తిచేసి, నిర్ణీత సమయంలోగా ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. రెడ్ హేండెడ్‌గా పట్టుబడ్డ కేసుల విషయంలో దిశ చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ముందుకుసాగాలన్నారు. నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు.
ఉరిశిక్ష పడాల్సిందే?
కాకినాడలో ప్రేమోన్మాది సూర్యనారాయణ కిరాతకంగా హత్య చేసిన దేవిక (22) మృతదేహాన్ని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, కాకినాడ ఎంపీ వంగా గీత మృతదేహాన్ని పరిశీలించారు. ప్రేమించలేదని యువతిని ఫ్యాక్షన్ తరహాలో హత్య చేయడం దారుణమని వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే ప్రేమోన్మాది యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చాడన్నారు. అమ్మాయి బతకకూడదని మెడపై ముందు, వెనక నరికేశాడని తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిపారు. వారం రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసేలా పోలీసు చర్యలు తీసుకుంటారన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రేమోన్మాది సూర్యనారాయణకు ఉరిశిక్ష పడాల్సిందే అన్నారు. అందుకు తగిన విధంగా బలమైన సాక్షాధారాలున్నాయని తెలిపారు. పేదరికంలో చదువుకుని తన కాళ్లపై నిలబడిన యువతికి ఇలా జరగడం దారుణమని ఎంపీ వంగా గీతా అన్నారు. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడుతుందన్నారు. ప్రేమ పేరుతో హింసకు పాల్పడుతున్న ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు.
అసలేం జరిగింది?
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలారం గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ(25) కొంతకాలంగా బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కె.గంగవరం గ్రామానికి చెందిన దేవిక(22)ను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. వీరు కూరాడలోని వారి బంధువుల ఇంటి వద్ద ఉండేవారు. ప్రేమిస్తున్నానంటూ సూర్యనారాయణ వేధిస్తున్నాడని యువతి బంధువులు పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయితీ పెట్టారు. దీంతో పెద్దల సూచనతో యువకుడి బంధువులు సూర్యనారాయణను అతడి సొంతూరు బాలారం పంపించేశారు. దీంతో పగపెంచుకున్న యువకుడు శనివారం ప్లాన్ ప్రకారం బైక్ పై కూరాడ వెళ్తోన్న దేవికను...కూరాడ-కాండ్రేగుల గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డగించాడు.
యాసిడ్ సీసా కూడా
తనను ప్రేమించాలని దేవికను సూర్యనారాయణ ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. రోడ్డుపై రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకున్న స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. యువతిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పెదపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకుడు తన వెంట యాసిడ్ సీసా కూడా తెచ్చుకున్నాడని పోలీసులు తెలిపారు.