కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్ నాయకుడు శేషగిరిపై జరిగిన దాడి కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భవాని మాలలో వచ్చి ఓ వ్యక్తి టీడీపీ నేతపై నవంబర్ 17న దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 


జిల్లాలోని తుని పట్టణంలో గురువారం (17-11-2022) నాడు టీడీపీ లీడర్‌ మాజీ ఎంపీపీ శేషగిరిరావుపై భవాని మాలలో ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేశాడు. భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించిన వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో శేషగిరిరావుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. శేషగిరిరావు కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి చేసిన కత్తి దాడిలో శేషగిరిరావుకు చేతికి, తలపై గాయాలయ్యాయి. కాకినాడ అపోలో అసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసిన పోటీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.


ఈ కేసులో కాకినాడ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ పి .శ్రీనివాస్ పర్యవేక్షణలో పెద్దాపురం ఇంఛార్జి డీఎస్పీ ఎస్.మురళీమోహన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శాస్త్రీయ పద్ధతులతో పాటు సాంకేతికతను కూడా ఉపయోగించుకుని ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముద్దాయిని గుర్తించడం జరిగింది. టీడీపీ నేతపై కత్తి దాడి కేసులో 28 ఏళ్ల యువకుడు అగ్రహారపు చంద్రశేఖర్ ను అరెస్ట్ చేశారు.


విశాఖపట్నం ఆరిలోవ, పెద్ద గదులు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి గురువుగా చలామణి అవుతుంటారు. నిందితుడు చంద్రశేఖర్ ఆ గురువు వద్ద శిష్యరికం చేస్తున్నాడు. తోటి శిష్యులతో కలిసి గురువు వెంట వెళ్లి ఇతర ప్రాంతాల్లోనూ పూజలు చేస్తుంటాడు. అలా పూజలు ద్వారా పరిచయమైన అనకాపల్లి జిల్లా కి చెందిన వ్యక్తి ప్రస్తుతం పాయకరావుపేటలో ఉంటున్న ఒక రిటైర్డ్ ఉద్యోగి ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు. వీలున్నప్పుడు తుని పాయకరావుపేట నామవరం పరిసర ప్రాంతాల్లో పూజలు చేసి వెళ్తుండేవారు. తుని పట్టణానికి చెందిన పోల్నాటి శేషగిరిరావు అనే వ్యక్తి పై దాడి చెయ్యాలి అని నిందితుడు చంద్రశేఖర్ కు గురువు చెప్పాడు. డబ్బులు ఇస్తానని చెప్పడంతో అందుకు చంద్రశేఖర్ అంగీకరించాడు. మిగతా స్నేహితులను కూడా తనతో తీసుకెళ్లి.. శేషగిరిరావు కదలికలపై నిఘా పెట్టారు. 


నవంబర్ 17న ఉదయం చంద్రశేఖర్ భవాని మాల ధరించి, నుదుటికి విభూది మరియు బొట్టు పెట్టుకుని, ముఖానికి మాస్కు ధరించాడు. తుని సమితి ఆఫీస్ వీధిలో ఉన్న పోలనాటి  శేషగిరిరావు ఇంటికి బైకు మీద వెళ్లాడు. ఇంటి ఆవరణలోనికి వెళ్లి బిక్ష అడిగాడు. బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడి చేశాడు చంద్రశేఖర్. బాధితుడు కేకలు వేయడంతో నిందితుడు చంద్రశేఖర్ అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. నిందితుడు బైకు మీద పారిపోతుండగా, శేషగిరిరావు అదే కత్తితో చంద్రశేఖర్ పై వీధి చివరి వరకు వెళ్లి దాడి చేయగా వీపుపై గాయమైంది. పోలీసులకు తాను దొరికిపోవడం ఖాయమని భావించిన నిందితుడు చంద్రశేఖర్ 23-11-2022 తేదీ మధ్యాహ్నం తుని టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ కేసులో దర్యాప్తు అధికారి అయిన ఎస్ మురళీమోహన్ ఎదుట లొంగిపోయి తన తప్పుడు అంగీకరించాడు. కేసులో మిగతా నిందితుల కొరకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.