Kakinada Crime : గ్రామ దేవత జాతరలో జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది.  కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని శృంగవృక్షంలో మంగళవారం రాత్రి పెద్దింట్లమ్మ, నూకాలమ్మ జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నడపల్లి రాము(22) అనే యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ  మృతిచెందాడు.  గ్రామంలో రెండు రోజులుగా గ్రామదేవతల జాతర ఉత్సవం జరుగుతోంది. తొండంగికి చెందిన యువకుడు నడిపల్లి రాము శృంగ వృక్షంలో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. గ్రామంలో జాతర జరుగుతుండటంతో వెళ్లాడు. జాతరలో సిద్దాంతపు రవి, అడపా సాయి భాస్కర్ల కాళ్లు  తొక్కాడన్న సంఘటనపై వివాదం తలెత్తింది. కాలు  ఎందుకు తొక్కావు అంటూ రాముపై దాడికి తెగబడ్డారు. దాన్ని కొందరు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. ఒక వర్గం దాడితో నడపల్లి రాముతోపాటు నక్కా నాగేశ్వరరావు, నక్కా ఇస్సాక్, పులుగు గంగబాబు, సిద్దాంతపు రవి, దడాల పెద అప్పలకొండ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం యువకుడ్ని తొండంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాము మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మిగిలినవారంతా తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యువకుడు మృతితో గ్రామంలో తీవ్ర అలజడి రేగింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఫికెటింగ్ ఏర్పాటు చేశారు.  మృతుని తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 13 మందిపై కేసు నమోదు చేశామని తొండంగి ఎస్సై ఎస్. రవికుమార్ వెల్లడించారు.  


మృతుని కుటుంబీకుల ఆందోళన 


యువకుడు నడపల్లి రాము మరో వర్గం దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందడంతో మృతుడి వర్గీయులు, కుటుంబీకులు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి, దాడికి కారకులైనవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తుని రూరల్ సీఐ సన్యాసిరావు నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 13 మందిపై హత్య, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పోలీసులను మోహరించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పోలీసులు గ్రామంలోనే ఉంటారని ఉన్నతాధికారులు తెలిపారు. 


బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు


తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, బాధిత కుటుంబాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు  పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కలెక్టర్ కృతికాశుక్లాతో చర్చించి, మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. కేసు దర్యాప్తునకు ప్రత్యేకాధికారిగా ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ, బి.అప్పారావును నియమించామని పర్యవేక్షణాధికారిగా జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) పి.శ్రీని వాసును నియమించినట్టు తెలిపారు. ఎస్పీ, ఇతర అధికారుల బృందం శృంగవృక్షంలో ఘటనా స్థలాన్ని  పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు.