కోన‌సీమ‌లో ఘరానా దొంగ అరెస్ట్‌..

 

రూ.47.18లక్షల విలువ గల బంగారం, వెండి స్వాదీనం..

 

ఉమ్మడి ఉభయగోదావరి 23 జిల్లాల్లో వరుస‌ దొంగతనాలు..

 

దేవాలయాలే టార్గెట్‌.. తాళాలేసిన ఇళ్లంటే మరీ ఇంట్రస్ట్‌.. ఎంతటి సెక్యూరిటీ ఉన్నా సరే అతగాడికి అవేమీ అడ్డురావు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ సారి దొంగతనం కేసులో జైలుకెళ్లి వచ్చాడు.. మరింత రాటుదేరాడు. ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైనా దృష్టిపెట్టాడు.. దీంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వరుస దొంగతనాలకు తెరతీశాడు.. ఊరుచివర ఉండే దేవాలయాలు, తాళాలు వేసుకుని బయటకు వెళ్లిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని ఏకంగా రూ.47,18,300 విలువైన 622 గ్రాముల బంగారాన్ని, 14 కేజీల 90 గ్రాముల వెండిని కొల్లగొట్టాడు.

పగలు దర్జాగా తిరుగుతూ రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పట్టుకుని కటకటాల వెనక్కు పంపారు డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసులు... పాలకొల్లు రూరల్‌ మండలం పూలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న కట్టా సుబ్బారావు అనే ఘరానా దొంగను పట్టుకుని రిమాండ్‌కు పంపారు. ఈ కేసుకు సంబందించి వివరాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్‌.శ్రీధర్‌ అడిష‌న‌ల్ ఎస్పీ ల‌తా మాధురితో క‌ల‌సి వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. 

 

చెడు వ్యసనాలకు అలవాటు పడి... 

నిందితుడు కట్టా సుబ్బారావు చెడు వ్యసనాలకు అలవాటుపడి దేవాలయాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని తాళాలు పగులకొట్టి బీరువాల్లో ఉన్న బంగారు, వెండి వస్తువులను  అపహరిస్తుంటాడని ఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ దొంగతనాల ద్వారా అపహరించిన బంగారు వెండి వస్తువులను విక్రయించి వీటి ద్వారా వచ్చిన సొమ్ముతో చెడు వ్యసనాలకు వినియోగిస్తుంటాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడి ఓసారి జైలుకు కూడా వెళ్లాడన్నారు.

 

7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 కేసులు..

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు కట్టా సుబ్బారావు దొంగతనాల్లో బాగా ఆరితేరాడని ఎస్పీ తెలిపారు. ఈక్రమంలో మలికిపురం, సఖినేటిపల్లి, వీరవాసరం, పాలకొల్లు రూరల్‌, పాలకొల్లు టౌన్‌, పాలకోడేరు, యలమంచిలి ఇలా ఏడు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సదరు నిందితుడు కట్టా సుబ్బారావుపై 23 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. శనివారం దిండి పరిసర ప్రాంతంలోని 216 జాతీయ రహదారి వద్ద మలికిపురం మార్కిటింగ్‌ యార్డ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద తచ్చాడు తుండగా అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిందితుని వద్దనుంచి రూ.37,32,000 విలువగల 622 గ్రాముల బంగారాన్ని, రూ.09,86,300 విలువచేసే 14.90 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.  ఈ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడ్ని  చాకచక్యంగా పట్టుకునేందుకు కృషి చేసిన కొత్తపేట ఎస్డీపీవో కె.వెంకటరమణ, అమలాపురం క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.గోవిందరాజు, మలికిపురం ఎస్సై జి.సురేంద్రబాబు, సిబ్బంది, సఖినేటిపల్లి ఎస్సై ఎస్‌.రాము, సిబ్బందిని, అమలాపురం క్రైం ఏఎస్సై బాలకృష్ణ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.