Kagaznagar Police:  అర్థరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లలోకి దూరి, చేతికి దొరికిన కాడికి నొక్కేద్దామని ప్లాన్ వేసిన ఆ ఇద్దరు ఘరానా దొంగల స్కెచ్ రివర్స్ అయింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని మారుతీనగర్‌లో అర్ధరాత్రి ఇద్దరు కేటుగాళ్లు భారీ చోరీ కోసం ఒక ఇంట్లోకి చొరబడ్డారు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే.. సీన్ కాస్త అడ్డం తిరిగింది.  ఇంట్లో వాళ్లు నిద్రపోతున్నారులే అని వీరు హ్యాపీగా పని కానిచ్చేస్తున్న తరుణంలో, కాలనీ స్థానికులు ఊహించని షాక్ ఇచ్చారు. దొంగల కదలికలను గమనించి ఒక్కసారిగా అప్రమత్తమైన స్థానికులు.. సినిమా ఫైట్ సీన్ తరహాలో దొంగలను చుట్టుముట్టారు. 

Continues below advertisement

 దోస్తీ అంటే ఇదేరా.. చేతులు కట్టేసిన జనం! 

సరిగ్గా జనం ఎంట్రీ ఇచ్చేసరికి ఇద్దరు దొంగల్లో ఒకడికి అదృష్టం, మరోకడికి బ్యాడ్ లక్ కలిసి వచ్చింది. కాలనీ వాళ్లు పట్టుకోవడానికి పరిగెత్తడంతో.. ఒక దొంగ తన దోస్తీ ని, పార్ట్‌నర్‌ను నడిరోడ్డుపై గాలికొదిలేసి, ఒంటికాలిపై అక్కడి నుంచి చీకట్లోకి జంప్ అయ్యాడు. ఇక మిగిలిన రెండో దొంగ ఒంటరిగా దొరికిపోవడంతో స్థానికులు అతనికి చుక్కలు చూపించారు. పారిపోయే ఛాన్స్ ఇవ్వకుండా ఆ దొంగ చేతులు వెనక్కి విరిచి గట్టిగా తాడుతో కట్టేసి, కాగజ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. దొంగతనం చేసి దర్జాగా వెళ్దామనుకున్న సదరు కేటుగాడు.. చివరకు చేతులు కట్టేసి నడిరోడ్డుపై కూర్చోబెట్టేసరికి బిక్కమొహం వేశాడు.    పోలీసుల ఎంట్రీ.. పట్టుబడ్డ కేటుగాడి ఊరేగింపు! 

Continues below advertisement

సమాచారం అందిన వెంటనే కాగజ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల బంధీలో ఉన్న దొంగను తమ ఆధీనంలోకి తీసుకుని, జీపులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లోకల్ ఏరియాలో దొంగ దొరకడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడ్డ సదరు కేటుగాడిని గట్టిగా  పోలీస్ స్టైల్ విచారణ  పెడితే.. పారిపోయిన రెండో దొంగ అడ్రస్, అసలు వీరు ఏ గ్యాంగ్‌కు చెందినవారనే గుట్టు మొత్తం విప్పుతాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పారిపోయిన ఆ రెండో    దొంగ కోసం పోలీసులు కాగజ్‌నగర్ అంతటా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  కాగజ్‌నగర్‌లో కలకలం.. తాళం వేస్తే జాగ్రత్త! 

ఈ అర్ధరాత్రి దొంగల హల్‌చల్ ఘటనతో కాగజ్‌నగర్ పట్టణ ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇళ్లలోకి ఇలా చొరబడి దొంగతనాలకు యత్నిస్తుండటంతో రాత్రి పూట నిద్రపోవాలన్నా జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆదిలాబాద్ లోకల్ మీడియా, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

కేసు నమోదు 

ప్రస్తుతం కాగజ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పట్టుబడిన దొంగ గతంలో ఎక్కడైనా ఇటువంటి చోరీలకు పాల్పడ్డాడా? అనే కోణంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా, తోటి దొంగను నడిబజార్లో వదిలేసి పరారైన ఆ రెండో దొంగ కోసం పోలీసులు వేట సాగిస్తుండటంతో.. త్వరలోనే ఈ  చోర్ గ్యాంగ్  ఆట కట్టవడం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.