Jubilee Hills Minor Girl Case :  జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచారం ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బాలికపై అత్యాచారం కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు.  పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ మాలిక్‌(18)ను అరెస్టు చేశామన్నారు. మిగిలిన వారిని రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు ఫుర్ఖాన్ కు ఎటువంటి సంబంధంలేదన్నారు. అతడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. అలాగే ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం పైనా ఆధారాలు లేవన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టామని డీసీపీ అన్నారు. ఒకరి పేరు మాత్రమే బాధిత బాలిక చెప్పగలిగిందన్నారు. సీసీ ఫుటేజ్, టెక్నీకల్ ఆధారాలు సేకరించామన్నారు. బాలిక స్టేట్మెంట్ తర్వాత సెక్షన్ లు మార్చామన్నారు. 


పోక్సో కేసు 


జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పుప్పాలగూడ వాసి సాదుద్దీన్‌ మాలిక్‌(18)ను అరెస్టు చేశామని డీసీపీ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. మరో నిందితుడిని రేపు ఉదయం అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈనెల 31వ తేదీన బాలిక తండ్రి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. 28వ తేదీన జరిగిన పార్టీకి బాలిక వెళ్లింది. ఆ తర్వాత జరిగిన ఘటనలతో షాక్ లోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన తండ్రి పాపపై లైంగిక దాడి జరిగి ఉంటుందని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రోజు బాలికను భరోసా కేంద్రానికి తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ చేసి వివరాలు సేకరించామన్నారు. భరోసా కేంద్రం అధికారులు ఇచ్చిన వివరాలతో అంతకు ముందు నమోదు చేసిన కేసుతో పాటు అత్యాచారం, పోక్సో చట్టం కింద సెక్షన్లు యాడ్ చేశామన్నారు. 


ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు


తనపై దాడికి ఎవరెవరు దాడికి పాల్పడ్డారనేది బాధితురాలు చెప్పలేకపోయిందని డీసీపీ తెలిపింది. ఒక నిందితుడి పేరు మాత్రం చెప్పిందని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ కేసును దర్యాప్తు చేపట్టామన్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ సేకరించి బాలిక చెప్పిన వివరాలతో ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వారిలో సాదుద్దీన్‌ మాలిక్‌(18)ని అరెస్టు చేశామని, రాత్రిపూట మైనర్‌ను చట్ట ప్రకారం పట్టుకోకూడదని, 18 ఏళ్లు నిండిన ఉమేర్‌ఖాన్‌, మిగతా ముగ్గురు మైనర్లను పేర్లు చట్ట ప్రకారం వెల్లడించకూదన్నారు. మరో 48 గంటల్లో మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. 


ప్రజాప్రతినిధి కుమారుడు! 


బాధితురాలు కోలుకున్న తర్వాత స్టేట్‌మెంట్‌ తీసుకుని, ఇంకా ఎవరి పాత్ర ఉన్నా వారికి శిక్షపడేలా చేస్తామని డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. హోంమంత్రి మనువడు ఉన్నారని ప్రచారం జరుగుతోదని, అది అవాస్తవం అన్నారు. బాధితురాలి ఫొటో, పేర్లు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు ఉన్నట్టు కచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా అరెస్టు చేస్తామన్నారు. పబ్‌లోకి పార్టీ ఉందని బాలికను తీసుకెళ్లారని, పబ్‌లో పార్టీపై ఇంకా దర్యాప్తు చేయలేదన్నారు. పబ్‌లో నిబంధనలు అతిక్రమించి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.