Srinagar Grenade Blast: జమ్ము కశ్మీర్ లోని అమైరా కాదల్ గ్రెనేడ్(Grenade) పేలుడు కేసును శ్రీనగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆదివారం జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు మరణించగా, 36 మంది గాయపడ్డారు. ఈ దాడి కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం టెక్నాలజీ సాయంతో ఛేదించింది. రద్దీగా ఉండే మార్కెట్‌లో గ్రెనేడ్ దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు అరెస్టు చేసింది. ఈ కేసులో శ్రీనగర్ పోలీసులు నగరంలోని మొత్తం సీసీటీవీల ఫుటేజీలు, సెల్ టవర్ డంప్ అనాలిసిస్, ఐపీ డంప్ అనాలిసిస్, క్రైమ్ సీన్ రిక్రియేషన్, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన వివరాలు తమకు సహాయపడ్డాయని పేర్కొన్నారు. ఈ దాడి చేసేందుకు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాన్ని ఉగ్రవాదులు(Terrorists) ఉపయోగించారు. దాడి అనంతరం ఉగ్రవాదులు అదే వాహనంపై పారిపోయారని సిట్ గుర్తించింది. శ్రీనగర్(Srinagar) లోని సీసీటీవీ(CCTV)ల ద్వారా నిందితులిద్దరూ ఖన్యార్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు.
ఇద్దరు అరెస్టు
ఖన్యార్‌లోని కూలిపోరాకు చెందిన నిందితుడు మహ్మద్ బారిక్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారంతో అదే ప్రాంతానికి చెందిన ఫాజిల్ నబీ సోఫీని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గ్రెనేడ్ దాడికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా సిట్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులు కశ్మీర్‌లోని ఉగ్రవాదుల సూచనల మేరకు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆగి ఉన్న సెక్యూరిటీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయగా, గ్రెనేడ్ రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలింది. దీంతో ఇద్దరు మరణించగా, 36 మందికి గాయాలయ్యాయి.
ఈ దాడితో సంబంధం లేదు : రెసిస్టెన్స్ ఫ్రంట్
గతేడాది ఆగస్టు 10, జనవరి 25, 2022లో ఇదే ప్రాంతంలో రెండు గ్రెనేడ్ దాడులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. వాణిజ్య సంస్థలు, వ్యాపారులు తమ దుకాణాల లోపల, వెలుపల సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీనగర్ పోలీసులు సూచించారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడితో సంబంధంలేదని తెలిపింది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాల దగ్గర అటువంటి దాడులను చేయరని పేర్కొంది. అమీరా కడల్ మార్కెట్ లో ఆదివారం సాయంత్రం గం.4.20 గంటలకు గ్రెనేడ్ దాడి జరిగింది. షహీద్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఈ దాడిపై కేసు నమోదైంది. ఈ పేలుడులో వృద్ధుడు, 19 ఏళ్ల యువతి మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు.