Jharkhand Dhanbad Fire Broke In Ashirwad Apartment : జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని బ్యాంక్ మోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోడా ఫటక్ రోడ్‌లోని ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో కనీసం పది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 14 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 


స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 14 మంది వరకు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న 50 మందికి పైగా ఇప్పటివరకు రక్షించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.






వేగంగా వ్యాపించిన మంటలు
ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ధన్‌బాద్ ఎస్ఎస్‌పీ సంజీవ్ కుమార్ తెలిపారు. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో అధిక ప్రాణ నష్టం సంభవించినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.


జార్ఖండ్ సీఎం సంతాపం..
ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని, ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.






ధన్‌బాద్‌లోని కుమార్‌ధుబీ మార్కెట్‌లో అగ్నిప్రమాదం
జనవరి 30న ధన్‌బాద్‌లోని కుమార్‌ధుబీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 దుకాణాలు బుగ్గి పాలయ్యాయి. మూడు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో దుకాణదారులు తీవ్రంగా నష్టపోయారు. అగ్నిప్రమాదంలో నాలుగు బట్టల దుకాణాలు, రెండు పూజ దుకాణాలు, 13 పండ్లు, కూరగాయల దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ మంటలను ఆర్పేందుకు 4 ఫైర్ ఇంజన్ల సిబ్బంది శ్రమించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.