Jangaon News : మెడికల్ సీట్ పేరుతో రూ.48 లక్షలు వసూలు చేశాడు బీజేపీ నేత.  మెడికల్ సీటు పేరు తో జనగాం బీజేపీ నేత కొత్తపల్లి సతీష్ కుమార్ డబ్బు వసూలు చేశాడు. కొత్తపల్లి సతీష్ కుమార్ పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.   మెడికల్ సీటు  ఇప్పిస్తానని మోసం చేసినందుకు సతీష్ ను అరెస్ట్ చేశారు.  జనగాం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు కొత్తపల్లి సతీష్ కుమార్. సతీష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మెడిక‌ల్ సీటు ఇప్పిస్తాన‌ని చెప్పి ఓ వ్యక్తి నుంచి కొత్తప‌ల్లి స‌తీష్ రూ. 48 ల‌క్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీటు రాకపోవడంతో మోస‌పోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసుల‌ను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  


కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో మోసం


కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి కాంబోడియా వెళ్లిన కరీంనగర్ యువకులు అక్కడి సైబర్ క్రైమ్ గ్యాంగ్ చేతికి చిక్కారు. జాబ్స్ పేరుతో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు చేసిన మోసానికి కొంతమంది యువకులు వారి చేతిలో బందీ అయ్యారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించిన సదరు ఏజెన్సీ నిర్వాహకులు వీరి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి కంబోడియా కి పంపించారు .అయితే అక్కడ జరుగుతున్న కథ వేరే ఉంది అనేక రకాల ఇల్లీగల్ పనులు చేయిస్తూ బెదిరిస్తున్నారని.. లేదంటే పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకొని జైల్లో పెట్టిస్తామని టార్చర్ పెడుతున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. 


3 వేల డాలర్లు డిమాండ్


తమని కాపాడాలని 3 వేల డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామని సదరు సైబర్ గ్యాంగ్ డిమాండ్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొత్త కాదు. ఇక్కడి నుండి దుబాయ్ ఇతర దేశాలకు ఉపాధి కొరకు పలువురు వెళ్తుంటారు ఇదే అవకాశంగా తీసుకొని కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు నిలువునా ముంచుతున్నారు .అటు డబ్బులు పోయి ఇటు జీవితం కోల్పోయి జీవచ్ఛవాల బతికే పరిస్థితి నెలకొంది. సరైన నిఘా లేకపోవడమే దీనంతటికీ కారణం అని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ప్రజలు గుడ్డిగా నమ్మడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని పోలీసు అధికారులు అంటున్నారు.


బాధితుల కుటుంబాలకు తప్పని చిక్కులు


ఉపాధి కోసం ఎక్కడో విదేశాలకు వెళ్లిన వారు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని వారిని తిరిగి స్వదేశానికి చర్యలు తీసుకు రావాలని పలువురు బాధిత మహిళలు సోమవారం రాత్రి కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణను కలిశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యువకులు కొన్నాళ్ల కిందట కంబోడియాకు వెళ్లారు. కరీంనగర్లోని కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ చూపిస్తామన్న పని కాకుండా వేరే పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుల సంఘం ఫిర్యాదులో పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నవీన్ తల్లి నిలోఫర్ బేగం సీసీ ని కలిసి తన కుమారుడిని స్వగ్రామానికి రప్పించాలని వేడుకొన్నారు.