Jagityal Petrol Attack :  జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం తుంగూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. దారి వివాదంలో అధికారులపై ఓ యువకుడు పెట్రోల్ తో దాడికి దిగాడు. అధికారులపై యువకుడు పెట్రోల్​ స్ప్రే చేసి నిప్పు పెట్టాడు. ఈ క్రమంలో ఎంపీవోకు మంటలు అంటున్నాయి.  తుంగూరు గ్రామానికి చెందిన తిరుపతి, గంగాధర్ మధ్య దారి వివాదం నడుస్తోంది.  దారి వివాదంతో రోడ్డు అడ్డంగా కర్రలు పెట్టాడు గంగాధర్‌. కర్రలు తొలగించేందుకు వెళ్లిన ఎస్‌ఐ, తహశీల్దార్‌, ఎంపీవోపై గంగాధర్ దాడి చేశాడు. ఎస్‌ఐ, తహశీల్దార్‌, ఎంపీవోపై పెట్రోల్‌ పోశాడు. ఈ దాడిలో నిప్పంటుకోవడంతో ఎంపీవోకు గాయాలయ్యాయి. ఆయన్ను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. 


ఎంపీవోకు గాయాలు 


దారి వివాదం తేల్చేందుకు ఎస్సై, తహసీల్దార్, ఎంపీవో మంగళవారం తుంగూరుకు వచ్చారు. అధికారుల రాకను గమనించిన గంగాధర్ స్ప్రెయర్ లో పెట్రోల్ పోసి అధికారులపై పిచికారీ చేశాడు. ఈ క్రమంలో ఎస్సై అతడ్ని ప్రతిఘటించి అడ్డుకునేందుకు యత్నించారు. అదే సమయంలో గంగాధర్‌ నిప్పంటించడంతో పక్కనే ఉన్న ఎంపీవో రామకృష్ణరాజుకు మంటలు అంటుకున్నాయి. అక్కడి నుంచి ఆయన పరుగులు పెట్టారు. ఆయనపై నీళ్లు చల్లి స్థానికలు మంటలు ఆర్పివేశారు. ఆ తర్వాత ఎంపీవోను చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన గంగాధర్‌ను తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


"తుంగూరులో గంగాధర్ అనే వ్యక్తి ఇంటి పక్కన రోడ్డు ఆక్రమించాడు. శానిటేషన్ ప్రాబ్లం అంది అక్కడ. నేను , ఎస్సై , ఎమ్మార్వో, గ్రామ సిబ్బంది అది క్లీన్ చేసేందుకు వెళ్తే గంగాధర్ పెట్రోల్ స్ప్రే చేశాడు. అందరిపై పిచకారీ చేశాడు. ఎస్సై గారిపై చేస్తుంటే నేను ఆపాను. అది ఫైర్ అయింది. నాకు అంటుకుంది. " అని ఎంపీవో తెలిపారు. 


"బీర్పూర్ మండలం తుంగూరులో గంగాధర్ చుక్కా అనే వ్యక్తి రోడ్డును ఆక్రమించుకోవడంతో ఒక పదిహేను , ఇరవై కుటుంబాలు కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిపీటెడ్ గా ఫిర్యాదులు చేశారు. దానిపై డీపీవో గారు, ఇతర అధికారులు వెళ్లి చెప్పారు. కానీ అతడు ఖాళీ చేయలేదు. ఇవాళ డీఎల్పీవో, ఎంపీవో, తహసీల్దార్, ఎస్సై వెళ్లి ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నిస్తే పెట్రోల్ ను స్ర్పేలో వేసి, అప్పటికే ఫ్లాన్ గా ఉన్నాడు గంగాధర్. అధికారులపై పెట్రోల్ స్ర్పే చేశాడు. మాగ్జిమమ్ ఎస్సైపై పడింది. ఎస్సైపై దాడిని అడ్డుకునేందుకు ఎంపీవో ప్రయత్నించారు. ఆ క్రమంలో ఎంపీవోకి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆయన షర్ట్ తీసివేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై డీపీవోకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారికి ఈ విషయం తెలిసింది. కలెక్టర్ గారు డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు."  -- లత, అడిషనల్ కలెక్టర్