Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పెను ప్రమాదం జరిగింది. విజయ్ నగర్ ప్రాంతంలోని స్వర్న్ బాగ్ కాలనీలోని మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ హృదయ విదారక ఘటనలో 9 మంది సజీవ దహనం అయ్యారు. అయితే, ఈ ప్రమాదానికి తొలుత షార్ట్ సర్క్యూట్ కారణం అనుకున్నా, అసలు విషయం తెలిసి పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఓ యువకుడు లవర్ తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఈ భవనానికి నిప్పంటించినట్లుగా బయటపడింది.


అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు విజయ్‌నగర్‌ పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి తొలుత తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 3 గంటల సమయం పట్టిందని చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు విజయ్ నగర్ ప్రాంతంలో ఉన్న దాదాపు 50 సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, దిమ్మతిరిగే వాస్తవం వారికి తెలిసింది.


ఈ అగ్ని ప్రమాదానికి మూలం శుభం దీక్షిత్ అనే యువకుడు మూలం అని పోలీసులు గుర్తించారు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఆ యువతి విజయన్ నగర్‌లోని ఓ భవనంలో అద్దెకు ఉంటోంది. తెల్లవారుజామున శుభం దీక్షిత్ అక్కడికి వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓ స్కూటర్‌లో పెట్రోల్ ట్యాంకుకు నిప్పు అంటించాడు. దీంతో స్కూటర్ నుంచి మంటలు పార్కింగ్‌లో ఉన్న మిగతా వాహనాలకు కూడా వ్యాపించాయి. అలా అగ్ని కీలలు మరింత ఎగసిపడి భవనం మొత్తం వ్యాపించిపోయాయి. భవనంలో అద్దెకు ఉంటున్న వారు మంచి నిద్రలో ఉండగా, ఈ భారీ అగ్నికి ఊపిరాడక సజీవ దహనం అయ్యారు. నిందితుడు శుభం దీక్షిత్ కొంత సేపటి తర్వాత ఆ ప్రాంతానికి వచ్చి సీసీటీవీ కెమెరాలను పగలగొట్టే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. 


హృదయ విదారకమైన ఈ ప్రమాదం తర్వాత, పోలీసులు సవాలుగా తీసుకొని అతణ్ని వెతికారు. మొత్తానికి పోలీసులు నిందితుడు సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్‌ను శనివారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాడు.