Indian origin woman arrested in North Carolina: ఇంటి పనులు సరిగ్గా చేయలేదని భార్యపై దాడులు చేసే భర్తల గురించి భారత సమాజంలో అందరికీ తెలుసు. కానీ ఇది రివర్స్.. భర్త ఇల్లు తుడవలేదని భార్య కత్తితో దాడి చేసింది.
ఉత్తర కరోలినాలోని షార్లెట్‌లో నివసిస్తున్న 44 ఏళ్ల భారత సంతతి మహిళ చంద్రప్రభ సింగ్, తన భర్త అరవింద్ మెడపై కత్తితో దాడి చేసిన ఆరోపణలతో ఈ నెల ప్రారంభంలో అరెస్టయ్యింది. చంద్రప్రభ బాల్లెంటైన్ ప్రాంతంలోని ఎండ్‌హావెన్ ఎలిమెంటరీ స్కూల్‌లో K-3 తరగతులకు టీచర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అక్టోబర్ 12, 2025, ఆదివారం నాడు చంద్రప్రభ సింగ్ తన భర్త అరవింద్ మెడను కత్తితో "ఉద్దేశపూర్వకంగా " కోసినట్లు అరెస్ట్ వారెంట్‌లో పేర్కొన్నారు. ఆమెపై ప్రాణాంతక ఆయుధంతో దాడి చేసి, తీవ్ర గాయం కలిగించినట్లు కేసు నమోదైంది.
అరవింద్ 911కి కాల్ చేసి, తన భార్య చంద్రప్రభ ఇల్లు శుభ్రం చేయనందుకు నిరాశతో ఉద్దేశపూర్వకంగా కత్తితో దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రప్రభ తన వాదనలో, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, తాను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తయారు చేస్తుండగా చేతిలో కత్తి ఉండగా, తిరిగేటప్పుడు ఆమె భర్త మెడకు పొరపాటున గాయం అయ్యిందని చెప్పింది.
ఘటన తర్వాత చంద్రప్రభను అరెస్టు చేశారు. మొదట మేజిస్ట్రేట్ ఆమెకు బెయిల్ నిరాకరించినప్పటికీ, అక్టోబర్ 13న జరిగిన కోర్టు విచారణలో $10,000 బెయిల్ మంజూరు చేశారు. చంద్రప్రభ జైలు నుండి విడుదలైంది, కానీ ఆమె ఎలక్ట్రానిక్ మానిటరింగ్ డివైస్ ధరించాలని, బాధితుడైన భర్తతో ఎలాంటి సంబంధం లేదా సామీప్యం ఉండకూడదని కోర్టు ఆదేశించింది.