Indian origin hospital worker filmed 13 000 people in bathrooms:  అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక హాస్పిటల్  ఉద్యోగి రహస్య  కెమెరా ద్వారా 13,000 మంది రోగులు, సిబ్బందిని బాత్ రూమ్‌లో ఉన్నప్పుడు  రహస్యంగా రికార్డు చేశాడు.  సంజయ్ శ్యామ్ ప్రసాద్  అనే వ్యక్తి   బ్రూక్లిన్  లో నివసిస్తున్నాడు.  నార్త్‌వెల్ హెల్త్ స్లీప్ డిసార్డర్స్ సెంటర్ లో స్లీప్ టెక్‌గా పనిచేస్తూ, జూలై 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు స్మోక్ డిటెక్టర్‌గా కనిపించే రహస్య  కెమెరాను ఉపయోగించి రహస్యంగా రికార్డింగ్‌లు చేశాడు.

స్లీప్ సెంటర్ ,  అదే భవనంలో ఉన్న స్పోర్ట్స్ ఫిజికల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ,  రిహాబిలిటేషన్ సర్వీసెస్ ఆఫ్ ది నార్త్ షోర్ (STARS)లోని తొమ్మిది బాత్రూమ్‌లలో వెల్క్రో డాట్స్‌తో ఈ కెమెరాను షవర్,  టాయిలెట్‌లను రికార్డు చేసేలా ఏర్పాటు చేశాడు. తన షిఫ్ట్ ముగిసిన తర్వాత ఈ ఫేక్ స్మోక్ డిటెక్టర్‌ను తొలగించి, వీడియో ఫైల్‌లను SD కార్డుకు బదిలీ చేసి, వాటిని తన వర్క్ కంప్యూటర్‌లో చూసేవాడు.

  సుమారు 13,332 మంది రోగులు , సిబ్బంది దృశ్యాలు చిత్రీకరించినట్లుగా గుర్తించారు.  ప్రాసిక్యూటర్లు 300కు పైగా వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు స్పష్టంగా లేకపోవడంతో ఐదుగురు బాధితుల్నే గుర్తించారు.  2024 ఏప్రిల్‌లో సంజయ్ తన ఫోన్‌లో బాత్రూమ్ ఫుటేజ్ చూస్తుండగా సహోద్యోగి ఒకరు గుర్తించారు. అతను పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే  అతన్ని నార్త్‌వెల్ స్లీప్ డిసార్డర్స్ సెంటర్ నుండి తొలగించి పోలీసులకు అప్పగించారు. 

సంజయ్   తన నేరం  బయటపడిందని  గ్రహించి, ఫేక్ స్మోక్ డిటెక్టర్ , SD కార్డును బ్రూక్లిన్‌లోని CVS ఫార్మసీ వద్ద డంప్‌స్టర్‌లో పడేసి, ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, నాస్సావ్ కౌంటీ పోలీసులు ఈ ఆధారాలను రికవర్ చేశారు. సంజై బ్రూక్లిన్‌లోని అతని నివాసంలో సెర్చ్ వారెంట్ ద్వారా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు  ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, SD కార్డ్ రీడర్లను స్వాధీనం చేసుకున్నారు.  

   సంజయ్   కెమెరాను కొనుగోలు చేసిన తేదీ నుండి ఏప్రిల్ 23, 2024 వరకు ఆస్పత్రిని సందర్శించిన అందరికీ పోలీసులు లేఖలు పంపారు.   నాస్సావ్ కౌంటీ DA కార్యాలయం బాధితులను గుర్తించేందుకు వేలాది వీడియోలను రివ్యూ చేస్తోంది. అయితే ఈ కేసులో అతను నేరం చేసినట్లు ధృవీకరించినప్పటికీ  జైలు శిక్ష లేకుండా ఐదు సంవత్సరాల ప్రొబేషన్ ను  మాత్రమే శిక్షగా విధించారు. మరింత శిక్ష విధింప చేసేందుకు బాధితుల్ని సమీకరిస్తున్నారు.