YS Jagan expressed concern over the financial situation of AP : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందని వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడి గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక నిర్వహణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ రాష్ట్రంలో సరైన ఆర్థిక వ్యయం లేకపోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతిందన్నదని విమర్శించారు.
రాష్ట్ర సొంత ఆదాయం వార్షిక ప్రాతిపదికన కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగిందని జగన్ అన్నారు. మొత్తం ఆదాయం (Revenue Receipts) అంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులతో సహా 6.14% వృద్ధిని మాత్రమే నమోదు చేశాయని జగన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. GST , సేల్స్ టాక్స్ ఆదాయాలు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే తగ్గాయన్నారు. ఇది వినియోగ స్థాయిలలో తగ్గుదలను సూచిస్తుందన్నారు. అదే సమయంలో రాష్ట్ర అప్పు (Debt) మొదటి త్రైమాసికంలోనే 15.61 శాతం పెరిగిందని.. ఇది ఆందోళనకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యయాలను భరించడానికి సొంత ఆదాయాలపై ఆధారపడటం తగ్గి, అప్పులు , కేంద్ర నిధులు) ఎక్కువగా ఆధారపడటం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక నిర్వహణ సవాళ్లను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో, సంక్షేమం , అభివృద్ధి కోసం సరైన మొత్తంలో ప్రభుత్వ వ్యయం అవసరమని జగన్ స్పష్టం చేశారు. ఇది ప్రైవేట్ , పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక గణాంకాలు ఈ లక్ష్యం సాధించడంలో విఫలమవుతున్నాయని సూచిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న అవినీతి కారణంగా ఆదాయ వనరులలో వృద్ధి నిరాశాజనకంగా ఉందని, కొన్ని రకాల ఆదాయాలలో ప్రతికూల వృద్ధి కూడా నమోదైందని విమర్శించారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభు్తవం ఎక్కువ అప్పులు చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించేవారు. కాగ్ కు నివేదికలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేవారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో.. వైఎస్ జగన్ కూడా ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు వచ్చినప్పుడల్లా విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన తెలుగులో కాకుండా ఇంగ్లిష్ లో ట్వీట్ చేయడంతో ఎంత మందికి అర్థమవుతుందన్న సందేహం వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో తెలియడానికే ఇలా ఇంగ్లిష్‌లో ట్వీట్లుచేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.