ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్చగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ చుట్టు పక్కల రాష్ట్రాలతో పాటు.. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా వంటి మెట్రో నగరాలకు గంజాయి జోరుగా తరలివెళ్తోంది. విశాఖపట్నం లోని అరకు ప్రాంతం నుంచి టన్నుల కొద్దీ గంజాయిని స్మగ్లర్లు తరలిస్తున్నారు. రోజూ ఎక్కడో ఓ చోట విశాఖపట్నం నుంచి వచ్చిన గంజాయి దొరుకుతోంది. వాహన తనిఖీలు, రైడ్ లు, నిఘాలు దాటుకుని గంజాయి ఎక్కడికి అంటే అక్కడికి స్మగ్లర్లు తరలిస్తున్నారు. టన్నుల కొద్దీ గంజాయి స్మగ్లింగ్ జరుగుతుండగా.. కేవలం కిలోల లెక్కన మాత్రమే పోలీసులకు పట్టుబడుతోంది. కొత్త కొత్త మార్గాల్లో గంజాయి దందా సాగిస్తున్నారు.
యథేచ్చగా గంజాయి దందా
తాజాగా యానాం పోలీసులు గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి యానాంకు జోరుగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆంధ్ర నుంచి అడ్డు అదుపు లేకుండా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతను పెడదోవ పట్టిస్తున్న మాఫియా గ్యాంగ్ కూపీని పోలీసులు లాగుతున్నారు. ఇటీవల ఇద్దరు వ్యక్తుల వద్ద పోలీసులు 900 గ్రాముల గంజాయి గుర్తించారు. వారిని అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా వారు కొన్ని వివరాలు వెల్లడించారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసుల బృందం విశాఖ జిల్లాకు వెళ్లింది. నర్సీపట్నానికి చెందిన రౌతు మహేష్, చింతల యామిని ప్రసాద్ అలియా పండులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఎస్సై కట్టా సుబ్బరాజు, బడుగు కనకారావు, సిబ్బంది కడలి శ్రీనివాస్, కడలి మహాలక్ష్మీ రావు, బడుగు దుర్గారావు, మల్లాడి గణేష్ బృందం గురువారం విశాఖ జిల్లా నర్సీపట్నానికి వెళ్లి రౌతు మహేష్, చింతల యామిని ప్రసాద్ ను అరెస్టు చేశారు. ఆ ఇద్దరు నిందితుల నుంచి 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని యానాం కోర్టులో హాజరు పరచగా.. వారికి కోర్టు రిమాండ్ విధించింది. విశాఖ వెళ్లి గంజాయి ముఠా సభ్యులను పట్టుకున్న ఎస్పీ, సీఐ బృందాన్ని సీఐ అభినందించారు.
కొత్తకొత్త దారుల్లో గంజాయి సరఫరా
ప్రభుత్వాలు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. గంజాయి రవాణా మాత్రం జోరుగా సాగుతోంది. రకరకాల మార్గాల గుండా గంజాయిని సరఫరా చేస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు పెద్ద ఎత్తున గంజాయి సరఫరా అవుతోంది. ఇక హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు తరలిస్తున్నారు. ఈ మధ్య వరంగల్ మీదుగా హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 550 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. డీసీఎం వాహనంలో తరలిస్తున్న సుమారు 550 కిలోల గంజాయిని ... వాహన తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. బలిమెల ప్రాంతం నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు ముందస్తు సమాచారం మేరకు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారు కాగా.. వారి కోసం గాలిస్తున్నారు.