అవినీతి కేసులో దొరికిపోయిన షేక్ పేట మాజీ తసహసీల్దార్ సుజాత అందరికీ గుర్తుండే ఉంటుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు సర్కారు పాలైంది. అవమానాలు తట్టుకోలేని ఆమె భర్త ప్రాణాలు విడిచాడు. సస్పెన్షన్, కేసులు, భర్తను కోల్పోయిన బాధ, మానసిక వేదన.. ఇలా సవాలక్ష కారణాలతో షేక్ పేట మాజీ ఎమ్మార్వో సుజాత ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఈరోజు గుండెపోటుతో మృతి చెందింది. అయితే పలువురు ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. మాజీ ఎమ్మార్వో మృతి విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..?
రెండేళ్ల క్రితం బంజారాహిల్స్ లోని ఓ స్థలం వ్యవహారంలో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్ పేట ఆర్ఐ నాగార్జున పట్టుబడ్డాడు. ఈ కేసులో తహసీల్దార్ సుజూత హస్తం కూడా ఉందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఆమె ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించగా.. భారీగా నగదు లభ్యం అయింది. నగదు విషయంలో తహసీల్దార్ సుజాతను మూడ్రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించగా.. ఆమె భర్తను కూడా ప్రశ్నించారు. భూముల విషయంలో తహసీల్దార్ ప్రమేయం ఉన్న్లు ప్రాథమికంగా నిర్ధరణ కావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు పంపించారు.
అపార్ట్ మెంట్ పైనుంచి దూకి అజయ్ ఆత్మహత్య..!
అయితే ఆమె భర్త అజయ్ ను ఆ మరుసటి రోజు విచారించాల్సి ఉంది. రమ్మని అతడికి కబురు పంపారు. అయితే అవినీతి కేసులో భార్య పట్టుబడడం, అరెస్ట్ అవడం, రోజుల తరబడి విచారించడం, ప్రశ్నలు అఢగడాన్ని జీర్ణించుకోలేక అదే రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ విశ్వ విద్యాలయంలో ఆచార్యుడిగా పని చేసే అజయ్.. తన ఇంటి అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. భర్త ఆత్మహత్య, కేసులు, సస్పెన్షన్లతో సుజాత అనారోగ్యానికి గురైంది. మానసికంగా, శారీరకంగా చాలా బలహీన పడిపోయింది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. తాజాగా ఆమె గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. ఉన్నత ఉద్యోగాలతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని.. అవినీతి కేసు వారిని ఆగం చేసింది.
సయ్యద్ ఖాలెద్ కూడా నిందితుడే..!
కాగా.. ఈ కేసు పలు మలుపులు తిరిగింది. ఇందులో ఫిర్యాదు దారుడు సయ్యద్ అబ్దుల్ ఖాలెద్ కూడా నిందితుడేనని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. అతడిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ తనదిని చెబుతున్న బంజారాహిల్స్ లోని 4,865 చదరపు గజాల స్థలం కూడా అతడిది కాదని తెలుస్తోంది. అతను ఇచ్చిన పత్రాలన్నీ ఫోర్జరీవేనని ఏసీబీ అధికారులు నిర్ధారించారు.