YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో నిందితుడైన గంగిరెడ్డి  బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డికి సీబీఐ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును కోరింది. గతంలో 90 రోజుల్లో సీబీఐ ఛార్జ్ షీట్ వేయకపోవడంతో గంగిరెడ్డికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన తరువాత కోర్టులో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు దగ్గరగా పర్యవేక్షణ చేస్తుందని సీబీఐ తెలిపింది. ఈ దశలో ఇన్వెస్ట్ గేషన్ ను తప్పుపట్టడం సరైంది కాదంది. పిటిషనర్లు కోర్టుకి వచ్చే అర్హతే లేదని వాదించింది. 


దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం 


వివేకా హత్య కోసం రూ.40 కోట్లు ఇచ్చిన సంగతి తేల్చాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. 306 ఐపీసీ కింద ఉన్న కేసు ట్రైల్స్ జరుగుతున్న కోర్టుకి వెళ్లాలి కానీ హైకోర్టు వచ్చే అధికారం లేదని తెలిపింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. వైఎస్ వివేకా హత్య వ్యవహారంలో రూ. 40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగాయని సీబీఐ మరోసారి హైకోర్టులో తన వాదనలు వినిపించింది.  ఈ హత్య ఎవరో చేశారో బయటపడాల్సి ఉందన్నారు. ఈ దశలో కేసు విచారణను తప్పుబట్టడం సరికాదని తెలిపింది.  


వివేకా హత్య కేసులో లైంగిక వేధింపుల కోణం 


 వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు మరో కారణాన్ని అనుమానితులు ఇటీవల కోర్టులో వెలిబుచ్చారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు లాయర్ కొత్త వాదనను హైకోర్టు ముందు ఉంచారు.  వైఎస్ వివేకా హత్యకు కారణం లైంగిక  వేధింపులేనన్నారు. సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకా లైంగికంగా వేధించారని అందుకే  దారుణంగా హత్య చేశారని వైఎస్ భాస్కర్  రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  రెండో భార్య కుమారుడ్ని రాజకీయ వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో విబేధాలు ఉన్నాయన్నారు.  


గొడ్డలి కొనుగోలు చేసింది దస్తగిరి 


వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేక హత్య కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్యకు దస్తగిరి గొడ్డలి కొనుగోలు చేశారని, హత్యచేసిన తీవ్ర అభియోగాలు ఉన్నాయని, అరెస్టు చేయకుండానే ముందస్తు బెయిల్‌కు సీబీఐ అభ్యంతరం చెప్పకపోవడం చట్ట వ్యతిరేకమని సోమవారం జరిగిన వాదనల్లో  నిందితుల తరపు లాయర్లు వాదించారు. ఈ కేసులో  భాసర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్‌ అయ్యేందుకు న్యాయమూర్తి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.