Telangana News: హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య జరిగింది. ఓ ఎన్నారైని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఇటీవల యూకే నుండి హైదరాబాద్‌ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్‌ అనే వ్యక్తి దుండగుల దాడిలో మరణించినట్లుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలను సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు గల కారణం.. వివాహేతర సంబంధం అని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుంచి హైదరాబాద్ వచ్చినట్లుగా ఫ్యామిలీ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.


సికింద్రాబాద్ లో మరో హత్య
సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజయ్ అనే వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, పక్క ఇంట్లోనే అద్దెకు ఉంటున్న అజయ్ ని కూరగాయల కత్తితో పొడిచి చంపాడు. చారి మద్యం మత్తులో సైకోగా మారాడు. మటన్‌ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పచ్చి కూరగాయలు తింటూ, ఇంటి పక్కన ఉన్నవారి పైకి, మహిళల పైకి  దాడికి పాల్పడ్డాడు. దీనిని అజయ్ అడ్డుకోవడంతో  కూరగాయల కత్తితో అజయ్ కడుపులో పొడిచాడు. అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని గాంధీ మర్చరీకి తరలించారు.


నిందితుడు చారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు. మృతుడు అజయ్ పెళ్లి భరాత్ బ్యాండ్ కంపెనీలో పని చేస్తాడని, ఇటీవలనే పెళ్లి అయ్యిందని 8 నెలల కూతురు ఉందని స్థానికులు తెలిపారు. మహంకాళి ఏసీపీ రవీందర్ అధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ ఆంజనేయులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.