హైదరాబాద్ నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఇదివరకే నగరంతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వీధి కుక్కల భయంతో బాలుడు మృతిచెందడం కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ విషాదం జరిగింది. వీధి కుక్కలు తమ కుమారుడి ప్రాణాలు తీశాయంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


అసలేం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కైసే ధుర్యోదన్, కైసే అనిషా భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరు 3 సంవత్సరాల కిందట మహారాష్ట్ర నుంచి నగరానికి వలస వచ్చారు. ప్రస్తుతం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి లెనిన్ నగర్ నివాసంలో ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. వీరి పెద్ద కుమారుడు కైసే మనోజ్ (11) నాలుగో తరగతి చదువుతున్నాడు.  మధ్యహ్నం ఒంటి గంట ప్రాంతంలో మనోజ్ మరియు ఇతని ఫ్రెండ్స్ లెనిన్ నగర్ లో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు వీరిని తరిమాయి.  


విధి కుక్కలు ఎక్కడ తమపై దాడి చేస్తాయోయోననే భయంతో పిల్లలు అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో బాలుడు మనోజ్ స్థానికంగా ఉన్న క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. వీధి కుక్కలు తరిమినందుకే ప్రాణాల కోసం పరిగెత్తిన తన కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


దూసుకొచ్చిన పెంపుడు కుక్క, భయంతో మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్‌ 
హైదరాబాద్‌ మణికొండలోని పంచవటి కాలనీలో పెంపుడు కుక్క దూసుకురావడంతో ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కాపాడుకునేందకు మూడో అంతస్తు నుంచి దూకేసిన ఘటన ఇటీవల జరిగింది. తీవ్రగాయాలపాలైన డెలివరీ బాయ్‌ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మణికొండ పంచవటి కాలనీ ఉంది. ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే కుటుంబ అమెజాన్ లో ఓ ప్రొడక్ట్ ఆర్డర్ చేసింది. అది డెలివరీ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. ఈ క్రమంలో డెలివరీ బాయ్ మూడో అంతస్తు ఎక్కగా.. అక్కడ ఉన్న ఓ పెంపుడు కుక్క యువకుడి మీదకు దూసుకొచ్చింది. భయాందోలనకు గురైన డెలివరీ బాయ్ ప్రాణ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకి దూకేశాడని స్థానికులు తెలిపారు. డాబర్ మెన్ డాగ్ మీదకు దూసుకురావడంతో కరుస్తుందేమోనన్న భయంతో కిందకి దూకిన డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గాయపడ్డ యువకుడ్ని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.


ఆ ఇంటి ఓనర్ ఈ ఘటనపై స్పందించారు. తాము ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో బెడ్ బుక్ చేశామని తెలిపారు. తమ ఫ్లాట్ కు వచ్చే కొంత సమయం ముందు డెలివరీ బాయ్ కాల్ చేశాడు. 5 నిమిషాల్లో వస్తానని ఫోన్ లో చెప్పాడన్నారు. డెలివరీ బాయ్ కోసం ఎదురుచూశాం, ఆ యువకుడ్ని చూసి మా పెంపుడు కుక్క అరిచింది. దాంతో డెలివరీ బాయ్ భయపడ్డాడు. కుక్క కరుస్తుందని భయంతో యువకుడు గోడ ఎక్కి దూకేశాడు. అయితే కుక్క కరవదని మేం చుబుతూనే ఉన్నాం, కానీ అతడు భయంతో కిందకు దూకాడని బెడ్ ఆర్డర్ చేసిన ఆ ఇంటి ఓనర్ తెలిపారు.