Shamshabad Drugs : డ్రగ్స్ స్మగ్లింగ్ రోజురోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. వీడొక్కడే సినిమాలో చూపించినట్లు విగ్రహాల్లో డ్రగ్స్ కలిపి స్మగ్లింగ్ చేస్తున్నారు. మత్స్యకారుల బోటుల్లో దేశంలోకి డ్రగ్స్ తరలిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో సూర్య వీడొక్కడే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో పెట్టుకుని మలేషియాకు తరలిస్తారు. సేమ్ టూ సేమ్ అలాంటి ఘటనలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెలుగుచూసింది. కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ దాచుకొని హైదరాబాద్ వచ్చిన టాంజానియా వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు.


రూ.12 కోట్ల కొకైన్ పట్టివేత 


హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి హైదరాబాద్‎కు డ్రగ్స్ తరలిస్తున్న విదేశీయుడిని అరెస్టు చేశారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో సుమారు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ పట్టుకున్నారు అధికారులు. తనిఖీల్లో 1,157 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ కు కొకైన్ తరలిస్తున్నట్లు సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. కొకైన్‌ ను మాత్రల రూపంలోకి కడుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం 79 క్యాప్సూల్స్‌ ను DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


3.12 కిలోల హెరాయిన్ సీజ్ 


హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డీఆర్‌ఐ అధికారుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళా ప్రయాణికురాలి వద్ద 3.12 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ ఖతార్‌ నుంచి దోహా మీదుగా హైదరాబాద్‌ కు వచ్చింది. కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా హెరాయిన్‌ను రెండు కవర్స్‌లో చుట్టి ట్రాలీబ్యాగ్ కింది భాగంలో సీక్రెట్ గా అమర్చారు. ముందస్తు సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మహిళ ట్రాలీబ్యాగ్ తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఈ హెరాయిన్‌ విలువ సుమారు రూ.21.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం ప్రయాణికురాలిపై కేసు నమోదు చేశారు. నిందితురాలిని జుడిషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.