Shamshabad Drugs Seize : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు రూ.80 కోట్ల విలువైన 8 కేజీల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్థరాత్రి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా కొకైన్ స్వాధీనం  చేసుకున్నారు. దక్షిణాఫ్రికా కేప్ టౌన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన టాంజానియా దేశస్థుడు, అంగోలా నుంచి వచ్చిన మహిళా కొకైన్ తరలిస్తున్నట్లు గుర్తించారు. అంగోలా - మొజాంబిక్ - లుసాకా - దుబాయ్ - హైదరాబాద్ కు టూరిస్ట్ వీసాపై మహిళ వచ్చినట్లు డీఆర్‌ఐ తెలిపింది. 


కడుపులో కొకైన్ మాత్రలు 


మొత్తం 8 కిలోల కొకైన్, ఒక్కొక్క ప్రయాణికుడు 4 కిలోలు తరలిస్తున్నారు. ట్రాలీ బ్యాగ్‌ల అడుగున సీక్రెట్ గా ప్యాకెట్లలో కొకైన్ తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన కొకైన్‌ విలువ రూ. 80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు సడలించారు. దీంతో కొందరు ఎయిర్ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు.  డ్రగ్స్ ను ఆహార పదార్ధాలు, షాంపూలు, బ్యాగుల్లో లామినేషన్ చేసి తరలించిన సందర్భాలు వెలుగుచూశాయి. పొట్టలో కొకైన్ మాత్రలు తరలించిన ఘటనలు కూడా ఉన్నాయి. 






రూ.3500 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం 


విమాన ప్రయాణికులు మాత్రల రూపంలో కొకైన్ దాచిపెట్టిన కేసులు ఉన్నాయి. గత నాలుగు నెలల్లో DRI అధికారుల ఇలాంటి కేసులు వెలుగుచూశాయి.  ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ముంబయిలో బుక్ చేసిన రెండు కేసులలో, ఇద్దరు ప్రయాణికులు మాత్రల రూపంలో 2.42 కిలోల కొకైన్ తరలిస్తుండగా పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఓ ప్రయాణికుడు కడుపులో 1.15 కిలోల కొకైన్‌ మాత్రలను తరలిస్తుండగా హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ముంబయి, హైదరాబాద్‌తో పాటు ఇతర విమానాశ్రయాల్లో కూడా కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. DRI తనిఖీల్లో 350 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 3,500 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో దాదాపు 303 కిలోల కొకైన్‌ను టుటికోరిన్ పోర్ట్‌లో కంటైనర్‌లో ఉంచిన కార్గో నుంచి స్వాధీనం చేసుకున్నారు.