Gun Firing in Hyderabad: హైదరాబాద్ లో సోమవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ వద్ద ఉదయం మూడు గంటల సమయంలో రౌడీ షీటర్‌ ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌ లో మరో రౌడీషీటర్ ముజ్జు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ కారులో వెళుతుండగా.. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ముజ్జు అతడిని ఆపాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజ్జు ఆరు రౌండ్‌లు కాల్పులు జరపాడు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో ఇస్మాయిల్ అక్కడిక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయ పడ్డాడు.


సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..


స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా.. ముజ్జు, ఇస్మాయిల్ ఇద్దరూ స్నేహితులేనని తెలుస్తోంది. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముజ్జు అరే మైసమ్మ టెంపుల్ సమీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదో గ్యాంగ్ వార్‌(Gang war)గా తెలుస్తోంది. జైల్లో ఏర్పడ్డ పరిచయంతో ఇరువురు సెటిల్మెంట్‌ల కోసం ముఠాగా ఏర్పడినట్టు సమాచారం. 


డబ్బు పంపకంలో తేడాలు వచ్చే...


ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య డబ్బు పంపకంలో తేడా వచ్చి.. ఇరువురి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని తెలుస్తోంది. ఎక్కడో చంపేసి నీరూస్ వద్ద శవాన్ని పడేసినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఇస్మాయిల్ మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


అయితే త్వరలోనే కేసును పూర్తిగా దర్యాప్తు చేసి.. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిజా నిజాలు పూర్తిగా తెలిసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం అన్నారు. అయితే ఈ హత్య గ్యాంగ్ వార్ అని తెలుస్తున్నట్లు చెప్పారు. గాయ పడిన వ్యక్తి కొంచెం కోలుకోగానే విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులకు శిక్ష పేడేలా చేస్తామని చెప్పారు.