Hyderabad Police saves a Man life: హైదరాబాద్ పోలీసుల మరో సారి వారి ఘనత చాటుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే వేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను గంటలోనే కాపాడారు. టెక్నాలజీ సాయంతో గంట వ్యవధిలోనే కేసును ఛేదించి వ్యక్తిని కాపాడగలిగారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad) జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీరప్పనగర్‌కు చెందిన మాలంపాక బాబీ (28) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నానంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనకు తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి సంప్రదించినా ఆచూకీ లభించలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టెక్నాలజీ సాయంతో
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్.. టెక్నాలజీ సహాయంతో బాబీ మొబైల్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ (Secunderabad)లోని మహంకాళి ప్రాంతంలో బాబీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు తన సిబ్బందిని పంపించారు. ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా బాబీ అప్పటికే దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. వెంటనే పోలీసు సిబ్బంది అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం బాధితుడిని అతడి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సాయంతో నిండు ప్రాణాన్ని కాపాడటంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.
ట్యాంక్ బండ్ లోకి దూకిన మహిళ
ఓ మహిళ ట్యాంక్ బండ్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ట్యాంక్ బ్యాండ్ శివ కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ట్యాంక్ బండ్ శివ హుస్సేన్ సాగర్ లోకి దూకి మహిళను బయటకు తీసుకొచ్చారు. ఆమె బతికి ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: హత్యాచారం చేసి, బట్టలు ఉతుక్కుని వెళ్లి హాయిగా నిద్రపోయాడు: కోల్‌కతా డాక్టర్ కేసులో సంచలనం