హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు నాటకమని పోలీసులు తేల్చేశారు. ముగ్గురు ఆటో డ్రైవర్లు తనను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు పెద్ద హై డ్రామా అని పోలీసులు ధ్రువీకరించారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని యువతి ఫిర్యాదు చేయగానే రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఈ కేసులో కిడ్నాప్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకనట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో అతణ్ని ఈ కేసులో ఇరికించేందుకు యువతి ఆడిన డ్రామాగా పోలీసులు తేల్చారు.


గంట లేట్‌గా ఇంటికి.. 
ఆమె చెప్పే విషయాలకు పొంతన లేకపోవడంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. సీసీటీవీ కెమెరాల్లో ఆధారాలు దొరక్కపోవడం, ఆమె చెప్పిన మాటలకు ఎక్కడా పొంతన కుదరకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేకాక, ఘటన జరిగిందని యువతి చెప్పిన ప్రదేశానికి కారులో వెళ్లి వచ్చేందుకే పోలీసులకు సుమారు 3 గంటల సమయం పట్టింది. అయితే రాత్రి 9.30కి ఇంటికి రావాల్సిన యువతి 10.30కి ఇంటికి చేరుకోవడంతో ఆమె తప్పుడు ఫిర్యాదు చేసిందని పోలీసులు భావిస్తున్నారు. యువతిపై రేప్ జరగలేదని వైద్య పరీక్షల్లో కూడా తేలినట్లు తెలుస్తోంది.


Also Read: Hyderabad Theft: అమ్మమ్మతో కలిసి యువకుడు దొంగతనాలు.. వీళ్లు ఆడే నాటకాలకి షాక్‌లో బాధితులు


అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి గ్యాంగ్ రేప్ జరిగిందనే వార్త కలకలం రేపింది. బాధితురాలైన యువతి పట్టపగలే తనను కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్లు, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ ఘటన పహాడి షరీఫ్ ప్రాంతంలో జరిగిందని పోలీసులకు చెప్పింది. 20 ఏళ్ల వయసున్న తనను సంతోష్ నగర్‌లో ఆటోలో కిడ్నాప్ చేసి పహాడీ షరీఫ్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టారు. ముందుగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఏ ఆధారమూ దొరక్కపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు యువతిని తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటికి వచ్చింది.


కట్టుకథ ఇలా..
యువతి తాను ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నానని చెప్పింది. ఫిర్యాదు చేసే సందర్భంలో కట్టుకథ అల్లింది. సంతోష్ నగర్‌లో తాను ఆటో ఎక్కానని, పహాడీ షరీఫ్ తీసుకువెళ్లిన తరువాత డ్రైవర్ మరో యువకుడిని ఆటోలో ఎక్కించుకున్నాడని చెప్పింది. ఆటో వెళ్తుండగా.. ఆ యువకుడు తనను అరవకుండా నోరు మూశాడని.. ఆటో డ్రైవర్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని చెప్పింది. తనను అక్కడే వదిలేసి అందరూ పరారయ్యారని పేర్కొంది.


Also Read: Vijayashanthi: ఒవైసీ గారూ.. వెళ్లి తాలిబన్లతో చర్చలు జరిపి రండి.. విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్